ఈనెల 30, 31 తేదీల్లో తిరుపతిలో జాతీయ గో మహా సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజైన శనివారం నాడు గోవు గొప్పతనం, ప్రకృతి వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత తెలిపేలా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రకృతి వ్యవసాయవేత్తలతో పాటు గోశాలల నిర్వాహకులు పాల్గొన్నారు. తెలుగురాష్ట్రాల్లోని వేయి మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించారు. 24 పంచగవ్య ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ రైతులను ఆకట్టుకున్నాయి.
దేశం ఆర్థికంగా, ధార్మికంగా, ఆరోగ్యపరంగా పటిష్టమవడానికి గోసంరక్షణే ఏకైక మార్గమని పలువురు నిపుణులు ఆభిప్రాయపడ్డారు. గోవులను పూజించడం, సంరక్షించడం మనందరి కర్తవ్యమని తెలిపారు.. రసాయన ఎరువులతో పండించిన ఆహార పదార్థాలతో అనారోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటల ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం తయారవుతుందని తెలిపారు.
గో ఆధారిత వ్యవసాయ ప్రాధాన్యతలపై అవగాహనే లక్ష్యంగా...
తిరుపతి మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న జాతీయ గో మహా సమ్మేళనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేయి మంది రైతులు హాజరయ్యారు. తొలిరోజు గో ప్రాధాన్యత, ప్రకృతి వ్యవసాయంతో ఉన్న లాభాలను వివరించారు. గో ఆధారిత వ్యవసాయంలో కలిగే ప్రయోజనాలు, రసాయన ఎరువుల వాడకంలో కలిగే అనర్థాలను వివరించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం అండగా ఉంటుందని ముఖ్య అతిథిగా హాజరైన తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. పండించిన ఉత్పత్తులను గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామన్నారు. నేలతల్లిని కాపాడుతూ ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించే దిశగా రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి.