తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాన్ని రూ.130 కోట్లతో కాకుండా... కేవలం రూ.36 కోట్లతోనే నిర్మాణం పూర్తి చేయాలని తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ప్రకటించడంపై... తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రస్తుత పాలక మండలి చర్యలు ఉన్నాయని ఆరోపించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తితిదే నిర్మిస్తున్న అమరావతి అలయ నమూనా... నిధుల కేటాయింపులో పలుమార్లు ఆలోచనలు చేశాకే నాలుగు దశల్లో నిర్మాణం చేపట్టామని పుట్టా సుధాకర్ యాదవ్ వివరించారు. పూర్వమే మధ్యప్రదేశ్‌లోని కురుక్షేత్రంలో, అనేక రాజధానుల్లో, దేశ విదేశాల్లో శ్రీవారి ఆలయాలను తితిదే నిధులతో నిర్మించి పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.