హనుమంతుని జన్మస్థలం సప్తగిరుల్లోని అంజనాద్రిగా నిరూపించేందుకు సిద్ధం కావాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి పండితులను కోరారు. ఏప్రిల్ 21న శ్రీరామనవమి పర్వదినాన తగిన ఆధారాలతో నిరూపిస్తామని తితిదే ఇప్పటికే ప్రకటించింది. తితిదే పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో ఈ అంశంపై పండితులతో ఈవో సమీక్షించారు. పవిత్రమైన శ్రీరామనవమి నాడు శ్రీవారి ఆలయంలో పూజల అనంతరం ఆలయం ముందు ఉన్న నాదనీరాజనం వేదికపై ఉదయం 11 గంటలకు హనుమంతుని జన్మస్థలాన్ని మీడియా ద్వారా తగిన ఆధారాలతో భక్తులకు తెలియజేయాలన్నారు.
అనంతరం అదనపు ఈవో ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు దక్షిణామూర్తి శర్మ, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.