తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన నవనీత సేవలో భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 13 నుంచి ఏడు బ్రాండ్లతో పరిమళభరిత అగరబత్తులు భక్తులకు విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్ హిల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు.
డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను వినియోగిస్తామని జవహర్‌రెడ్డి అన్నారు. మొదటి దశలో 35 విద్యుత్ కార్లను తిరుమలలోని సీనియర్ అధికారులకు అందించినట్లు తెలిపారు. రెండో దశలో యాత్రికులకు ఉచిత బస్సులు ప్రారంభిస్తామన్నారు. తిరుమల-తిరుపతి మధ్య ఆర్‌టీసీ విద్యుత్ బస్సులను నడిపే ప్రక్రియ తుది దశలో ఉందన్నారు.