TTD EO Jawahar Reddy: కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు, బుుషులు.. ఎంతో విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను రాత పత్రుల్లో నిక్షిప్తం చేశారని తితిదే ఈవో జవహర్ రెడ్డి అన్నారు. వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. రాత ప్రతుల డిజిటలైజేషన్ అంశంపై తితిదే పరిపాలనా భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తితిదేతో పాటు, తిరుపతిలోని యూనివర్సిటీల గ్రంథాలయాల్లో ఉన్న రాత ప్రతులను డిజిటలైజ్ చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జాతీయ రాత ప్రతుల సంస్థ (నేషనల్ మాన్యు స్క్రిప్ట్స్ డిపార్ట్మెంట్) నిబంధనల ప్రకారం ఎలా డిజిటలైజ్ చేయాలి ? వాటిని ఎలా భద్రపరచాలి ? అనే అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం అందుబాటులో ఉన్న ఒక భవనాన్ని వాడుకోవాలని.., తగిన భవనం అందుబాటులో లేకపోతే కొత్త భవన నిర్మాణానికి స్థలాన్ని గుర్తించాలన్నారు. రాతప్రతుల డిజిటలైజేషన్ కోసం అత్యాధునిక పరికరాలు సమకూర్చుకోవాలని, ఇందుకు సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.