భక్తులు కనుమ దారుల్లోకి వస్తూనే ఆహ్లాదకరమైన అనుభూతి పొందేందుకు రెండువైపులా విరివిగా పూల మొక్కలు పెంచాలని తితిదే ఈఓ జవహర్ రెడ్డి అటవీశాఖ అధికారులను ఆదేశించారు. తితిదే పరిపాలనా భవన సమావేశ మందిరంలో సాయంత్రం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
బండరాళ్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వాటిని కప్పేసేలా పెరిగే మొక్కలు నాటాలన్నారు. తిరుమలలో పవిత్ర ఉద్యానవనాల ప్రారంభానికి త్వరగా చర్యలు తీసుకోవాలని ఉద్యాన విభాగం సహాయ సంచాలకులను ఆదేశించారు. కనుమ దారుల్లో బండరాళ్లు పడే అవకాశం ఉన్నచోట రక్షణ కోసం ఏర్పాటు చేసిన వలలు కొన్ని ప్రాంతాలలో దెబ్బతిన్నాయని.... వాటిని పటిష్టం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. తిరుమల మ్యూజియం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని అదనపు ఈఓ ధర్మారెడ్డికి దిశానిర్దేశం చేశారు. మరుగున పడిన అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోకి తెచ్చేలా ప్రణాళిక తయారు చేయాలన్నారు.