ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని భగవద్గీత అందిస్తుందని తితిదే ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి ఇస్కాన్ దేవాలయంలో నిర్వహించిన భగవద్గీత పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.పి. కృష్ణయ్య గేయాల రూపంలో అనువదించిన భగవద్గీతను మాజీ డీజీపీ అరవింద రావుతో కలిసి ఆవిష్కరించారు. ఎన్ని వ్యాఖ్యానాలు వచ్చినా.. భగవద్గీత అందించే ప్రేరణ అనిర్వచనీయమని ఈవో వ్యాఖ్యనించారు.
కరోనా కష్టకాలంలో గీతా పారాయణం ద్వారా భక్తుల ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం తితిదే చేసిందన్నారు. నేటి తరానికి ఉపయుక్తమయ్యేలా వేదాలను సరళమైన భాషలోకి అనువదించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భగవద్గీత సందేశాన్ని సరళతరం చేసిన కృష్ణయ్యకి అభినందనలు తెలిపారు.