తితిదే బాధ్యతల నుంచి అనిల్ కుమార్ సింఘాల్ రిలీవ్ తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా పనిచేసేందుకు ఐఏఎస్‌లు చాలావరకూ ఆశపడుతుంటారు. అంతటి ప్రాధాన్యత కలిగిన పోస్టులో మూడేళ్ల ఐదు నెలలపాటు సమర్థంగా పనిచేశారు అనిల్‌కుమార్ సింఘాల్. గతంలో 1974 నుంచి 1982 వరకు పీవీఆర్‌కే ప్రసాద్ మూడేళ్ల 8 నెలల పాటు తితిదే ఈవోగా పనిచేయగా మళ్లీ 38 సంవత్సరాల తర్వాత సుదీర్ఘకాలం పాటు తితిదే ఈవోగా పనిచేసిన అధికారిగా సింఘాల్ నిలిచారు. తితిదే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ లేదా దక్షిణాది రాష్ట్రాల అధికారులే అందుకున్న ఈవో పగ్గాలను ఉత్తరాది నుంచి అందుకున్న మొదటి అధికారి సింఘాలే. తన పదవీ కాలంలో సమస్యలు ఎదురైన ప్రతిసారి పరిష్కారాలను వెతుకుతూ తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఆయన కృషి చేశారు.
శ్రీవాణి ట్రస్టు ఏర్పాటుతో ఆదాయం పెంపు
తితిదే వెబ్‌సైట్లలో అన్యమత ప్రచారం, శ్రీవారి బంగారు నిల్వలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, ఆస్తుల విక్రయం వంటి వివాదాస్పద అంశాల పరిష్కారంలోనూ తితిదే ప్రతిష్ఠ దెబ్బతినకుండా వ్యవహరించారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ మొదలు, కరోనా వేళ ఏకాంతంగా బ్రహ్మోత్సవాల వరకు ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, ఆలయంలో నిర్వహించే వైదిక కార్యక్రమాలకు అవాంతరాల్లేకుండా పాలనాపర నిర్ణయాలు తీసుకోవడంలో విజయవంతమయ్యారు. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటుతో తితిదే ఆదాయం పెంచేందుకు కృషి చేశారు. సర్వదర్శనానికి టైమ్‌స్లాట్ టోకెన్లు ప్రవేశపెట్టి భక్తుల క్యూలైన్ కష్టాలను చాలావరకూ తగ్గించారు. తితిదే పాలనాపరమైన అంశాల్లో ఈ- ఆఫీస్ ప్రవేశపెట్టారు. ఇలా ఎన్నో కార్యక్రమాలతో తితిదే ఈవోగా తనదైన ముద్ర వేశారు అనిల్ కుమార్ సింఘాల్.
ఇదీ చదవండి :మంత్రి పెద్దిరెడ్డి నాపై కక్ష కట్టారు : జడ్జి రామకృష్ణ