తిరుమలలో 91 మంది తితిదే ఉద్యోగులకు కరోనా సోకిందని తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలకు వచ్చి పరీక్ష చేయించుకున్న ఏ ఒక్క భక్తునికీ కరోనా సోకలేదని స్పష్టం చేశారు. తిరుపతి పరిపాలన భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలిపిరి వద్ద 1,704, తిరుమలలో 1,865 మంది తితిదే ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించామని.. మొత్తం 631 మంది యాత్రికులకు కరోనా పరీక్షలు చేశామని వెల్లడించారు.
రూ.16.73 కోట్ల ఆదాయం
జూన్ 11 నుంచి జులై 10 వరకు రూ.16.73 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తలనీలాల విలువ పెరగడం వల్ల రూ.7 కోట్ల అదనపు ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. మొత్తం 13.36 లక్షల లడ్డూలు విక్రయించామని.. 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. లక్షా 64 వేల మంది ఆన్‌లైన్ ద్వారా.. 85,434 మంది భక్తులు కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో వెల్లడించారు. టికెట్లు బుక్ చేసుకున్న 30 శాతం మంది తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారని తెలిపారు.