కరోనా ప్రభావంతో తిరుమలపై కూడా ఉందని తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి టికెట్లు పొందిన భక్తులు తిరుమల యాత్రను రద్దు చేసుకోరని.. కరోనా ప్రభావంతో గడిచిన నెల రోజుల కాలంలో దాదాపు 30 శాతం మంది శ్రీవారి దర్శన టికెట్లు ఉన్నా.. తిరుమలకు రాలేదని ఈవో వివరించారు. హుండీ, తలనీలాలు, వసతి గృహాలు, లడ్డూ ప్రసాద విక్రయాలు ఇలా వివిధ రూపాల్లో శ్రీవారి ఖజానాకు జమ అయ్యే మొత్తం భారీగా తగ్గిపోయిందన్నారు.
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత జూన్ 11 నుంచి జులై 10 వరకు 16.73కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు అనిల్ సింఘాల్ వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా 1.64 లక్షల మంది భక్తులు, కౌంటర్ల ద్వారా 85,434 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని తెలిపారు. టికెట్లు బుక్ చేసుకున్న 30 శాతం మంది తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారని చెప్పారు.