సీఎం పర్యటన, గరుడ వాహనసేవకు పటిష్ఠ ఏర్పాట్లు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా...ఇవాళ ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాలలో ప్రధానమైన గరుడ వాహన సేవను రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నారు. గరుడ సేవకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
సీఎం పర్యటన ఇలా..
సీఎం జగన్... దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరారు. తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకొంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత..బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుని..అక్కడనుంచి పట్టు వస్త్రాలు సమర్పించడానికి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. తర్వాత అతిథి గృహానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంటారు. తర్వాత తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
ఇదీ చదవండి :ప్రభుత్వం, అధికారులు.. దేవాలయాల జోలికి రావొద్దు: పరిపూర్ణానంద