TTD Contract Employees Protest: తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను శుభ్రపరిచి పారిశుద్ధ్య పనులు చేసేందుకు.. తితిదే ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీస్ (F.M.S) కింద 5 గుత్తేదారు సంస్థలు ఉన్నాయి. వీటిలో సుమారు 7 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను తితిదే కార్పొరేషన్‌లో కలపాలంటూ..విధులు బహిష్కరించి తితిదే పరిపాలనా భవనం ఎదుట 12 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఇన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా..తమను అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి..టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11న జరిగే తితిదే పాలకమండలిలో.. సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కార్మికులెవరూ పనులకు రాకపోవడంతో గదుల పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రముఖులకు కేటాయించే గదుల్లో ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ.. సాధారణ భక్తులకు కేటాయించే సీఆర్వో, ఎంబీసీ గదుల కేటాయింపు కార్యాలయాల పరిధిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గుత్తేదారులు..రోజువారీ కార్మికులతో గదులను శుభ్రం చేయిస్తున్నా.. భక్తుల తాకిడికి అవి సరిపడటం లేదు. కొండపైకి చేరుకున్న భక్తులకు గంటల తరబడి వేచిఉన్నా గదులు దొరకని పరిస్థితి నెలకొంది.