భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు, కంపార్టుమెంట్లు.. TTD:తిరుమల శ్రీవారి దర్శనానికి టికెట్లు లేకుండా వస్తున్న భక్తులతో క్యూలైన్లు, కంపార్టుమెంట్లు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం-2లో కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోవడంతో.. భక్తులు వైకుంఠం-2 వెలుపల బారులు తీరుతున్నారు. అయితే.. దర్శనం టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి పంపిస్తున్నారు తితిదే సిబ్బంది. టికెట్లు లేకుండా నేరుగా వచ్చిన భక్తులకు రేపట్నుంచి దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. మరోవైపు అలిపిరి నడకమార్గం ద్వారా భక్తులు పెద్దసంఖ్యలో తరలివెళ్తున్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం:శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ కేంద్ర వద్ద జరిగిన తోపులాట ఘటనపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. భక్తుల రద్దీ దృష్ట్యా సర్వదర్శనం స్లాట్ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వైకుంఠంలో వేచిఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్ల తెలిపారు. వైకుంఠం-2, క్యూ లైన్లు అదనపు ఈవో తనిఖీ చేశారు. భక్తులకు అందుతున్న వసతులను పరిశీలించారు. భక్తులు భారీగా తరలిరావడంతో శ్రీవారి దర్శనం కోసం 20 నుంచి 30 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉన్నందున రద్దీ చూసుకుని తిరుమలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
Somu Veerraju on TTD:తిరుమలలో జరిగిన తోపులాటకు తితిదే అధికారుల అనాలోచిత విధానాలకు అద్దం పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా మండిపడ్డారు. అలిపిరి వద్ద శ్రీవారి ఉచిత దర్శన టోకెన్లు జారీ, కొవిడ్ సమయంలో ప్రవేశపెట్టిన విధానం ఇంకా కొనసాగించడాన్ని వీర్రాజు తప్పుబట్టారు. తితిదే అధికారులు అవగాహనా రాహిత్యం వల్లనే తొక్కిసలాట, సృహతప్పి భక్తులు పడిపోయారని ఆక్షేపించారు. తితిదే పాలకమండలి తీసుకున్న నిర్ణయం భక్తులకు శరాఘాతంగా మారిందని.. వెంటనే ఎలాంటి టోకెన్లు లేకున్నా భక్తులందరికీ శ్రీవారి దర్శన అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తానే భక్తులతో సహా ఎలాంటి టోకెన్లు లేకుండా తిరుమల యాత్ర చేపడుతానని సోము వీర్రాజు హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా భగవంతుణ్ణి - భక్తులకు దూరం చేసి, ధర్మ విరుద్ధంగా వ్యవహరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
PAWAN ON TTD: తిరుపతిలో భక్తుల ఇబ్బందులపై జసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించించారు. తితిదే అధికారుల తీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో గతంలో లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. దర్శన టోకెన్లు కోసం జరిగిన తోపులాటపై పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానని పవన్ తెలిపారు. కౌలు రైతులకు ఏడాదిన్నరగా ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదన్న పవన్.. నేను వస్తున్నానని.. బాధితుల ఖాతాల్లో నగదు జమ చేయడం మెుదలైందన్నారు.
భక్తులకు దర్శన భాగ్యం కల్పించలేని స్థితిలో వైకాపా:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టపగలే చుక్కలు చూపిస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ ఆరోపించారు. దైవ దర్శనం చేసుకోవాలనుకునే సామాన్యులకు కనీసం తాగునీరు ఇవ్వలేని స్థితిలో తితిదే ఉండటం దారుణం అన్నారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. తితిదే ఛైర్మన్ రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారని.. సామాన్యుల అవస్థలు పట్టించుకునే స్థితిలో లేరని ఆరోపించారు. సామాన్య భక్తులను ఇన్ని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం.. వీఐపీలకు మాత్రం రాజమార్గంలో దర్శనాలు చేయిస్తోందని ఆరోపించారు.
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లేకుండా చేస్తున్నారు: తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. లాభాలు, జే ట్యాక్స్ లెక్కేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానమేమీ వైవీ సుబ్బారెడ్డి సూట్‌కేసు కంపెనీ కాదని... ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల నమ్మకమని లోకేశ్ ధ్వజమెత్తారు. ఆపద మొక్కులవాడి చెంతకొచ్చేవారిని వైకాపా పాలకులు ఆపదలోకి నెట్టారని మండిపడ్డారు. వందల ఏళ్ల తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనంతగా... ప్రస్తుత పాలకవర్గం చేసిందని విమర్శించారు. మండుటెండల్లో సర్వదర్శన టోకెన్ల కోసం చిన్నపిల్లలు, వృద్ధులతో శ్రీవారి భక్తులకు అష్టకష్టాలు పెట్టడం మీకు న్యాయమేనా అని ప్రశ్నించారు. శ్రీవారి సేవలు, టికెట్లు, ప్రసాదం ధరలు మూడింతలు పెంచడంపై ఉన్న ఆరాటం... భక్తులకి కనీస సౌకర్యాలు కల్పించడంలో లేదని మండిపడ్డారు. ఆ దేవదేవుడు అన్నీ చూస్తున్నాడని హెచ్చరించారు.
తిరుమల శ్రీవారి పట్ల జగన్‌రెడ్డి పాలనలో తిరుమలలో హృదయవిధారకర ఘటనలు చూస్తుండటం బాధాకరం అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. ఈ నీచమైన ప్రభుత్వం.. తిరుమలలో దర్శన భాగ్యం కూడా కల్పించలేకపోతుందని ఆయన మండిపడ్డారు. తిరుమలలో స్వామిని సామాన్య భక్తులకు దూరం చేసే కుట్ర ఆలోచనలు తాజా తితిదే చర్యలతో బలపడుతున్నాయని తెదేపా నేత పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. స్వామివారి దర్శనం ఆలోచన సామాన్య కుటుంబాలకు మళ్లీ రాకుండా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఇది నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వక కుట్రో తితిదే సమాధానం చెప్పాలని కేశవ్ డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు పడే ఇబ్బందులు చూస్తే గుండె తరుక్కుపోతోందన్న కేశవ్... స్వామివారి దర్శనం కోసం ఏడాది పాటు ప్లాన్ చేసుకుని వస్తే కొండమీదకు వెళ్లేందుకు అనుమతులు తీసుకోవాలా ? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:తిరుపతిలో టోకెన్ల కోసం భక్తుల తోపులాట.. ఐదు రోజులపాటు బ్రేక్ దర్శనాలు రద్దు