తిరుచానూరులోని నవజీవన్ అంధులు, వృద్ధుల సేవా సంస్థను తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు సందర్శించారు. 70 మంది అంధ విద్యార్థులకు, 30 మంది వృద్ధులకు దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేశారు. నవజీవన్ సేవా సంస్థకు తితిదే చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి రూ.50 వేల విరాళం అందజేశారు.
ట్రస్టు 42 సంవత్సరాలుగా అంధ విద్యార్థుల పాఠశాల, వృద్ధాశ్రమం నిర్వహించడం అభినందనీయమని సుబ్బారెడ్డి ప్రశంసించారు. 15 సంవత్సరాలుగా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. సంస్థలో ఉన్న అంధ విద్యార్థులకు, వృద్ధులకు ఏడాదికోసారి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. అంధ విద్యార్థులు అన్నమాచార్య సంకీర్తనలను చక్కగా ఆలపిస్తున్నారని, ఆసక్తి ఉన్న పిల్లలకు తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా శిక్షణ ఇప్పించి తిరుమల నాదనీరాజనం వేదికపై పాడే అవకాశం కల్పిస్తామని తెలిపారు.