Tirumala Srivari Brahmotsavalu: ఈనెల 27 నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు. ప్రముఖులు సొంతంగా తిరుమలకు వస్తే దర్శన ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.
తిరుమల శ్రీవారిని నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు . ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను తితిదే అధికారులు అందజేశారు.
తిరుమల శ్రీవారిని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామివారి అభిషేక సేవలో... ఆయన కుటుంబసమేతంగా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు... డీజీపీకి స్వాగతం పలికి... దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో ఇవాళ పోలీసు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన శ్రీవారి పుష్కరిణి:సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి సిద్ధమైంది. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలో మరమ్మతులు నిర్వహించి నీరు నింపడం ఆనవాయితీ వస్తోంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పుష్కరిణి మరమ్మతు పనులు ప్రారంభించారు. నీటిని తొలగించి అడుగు భాగాన్ని శుభ్రపరచారు. తర్వాత పైపులకు మరమ్మతులు పూర్తిచేసి ఊట గుంటలను పరిశుభ్రపరిచారు. మరమ్మతులు పూర్తయ్యాక పుష్కరిణిలో పెయింటింగ్, ఇతర సివిల్ పనులను చేసి నీటిని విడుదల చేశారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు:తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని రాయలసీమ రేంజ్ డీఐజీ రవిప్రకాష్ తెలిపారు. దసరా పండుగ దృష్ట్యా తిరుమలకు భక్తుల తాకిడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉదయం ఆయన శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో తితిదే విజిలెన్స్, జిల్లా పోలీసు యంత్రాంగంతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. రెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మోత్సవాలను మాడ వీధుల్లో నిర్వహిస్తున్నారన్నారు. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. గరుడ వాహన సేవ రోజునా ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు వచ్చే ఆవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు చేసిన సూచనలను భక్తులు పాటిస్తే ప్రశాంతంగా వాహన సేవలను తిలకించవచ్చని ఆయన తెలియజేశారు.
ఇవీ చదవండి: