దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని....ఈ నెల చివరి వరకు సంఖ్య పెంచే ఆలోచన లేదని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన తితిదే ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం అనంతరం సమావేశం వివరాలను మీడియాకు తెలిపారు.
ఆదాయ వ్యయాలను పరిగణలోకి తీసుకోకుండా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా తితిదే చర్యలు చేపడుతోందని ఛైర్మన్ తెలిపారు. రోజుకు పన్నెండు వేల మంది భక్తులు శ్రీవారి దర్శించుకొంటున్నారని...ఆ సంఖ్యను పెంచే ఆలోచన లేదన్నారు. కళ్యాణకట్ట, అన్నప్రసాద వితరన కేంద్రాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కొంత మంది సభ్యులు సూచించారని....అందుకు అనుగుణంగా భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత కల్పించేలా విస్తృత చర్యలు చేపడతామన్నారు. ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఉద్యోగుల్లో మనోధైర్యం నింపడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు తీసుకొంటామన్నారు. తిరుమలలో విధులు నిర్వహించే ఉద్యోగులకు క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులకు ఆధునిక వైద్యసేవలు అందించడానికి ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేస్తామన్నారు.