తిరుమల అన్నమయ్య భవనంలో ఇవాళ తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. బ్యాంకుల్లో నిల్వచేసిన కార్పస్ ఫండ్ నుంచి నిధుల డ్రా, భక్తుల దర్శనాలు, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం వంటి పలు కీలక అంశాలు సమావేశంలో చర్చకురానున్నాయి.
కరోనా కారణంగా శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య పరిమితం చేయడం వల్ల ఆ ప్రభావం తితిదే ఖజానాపై పడింది. హుండీతో పాటు వివిధ రూపాలలో సమకూరే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంగా ఆలయాల నిర్వహణతో పాటు...తితిదే ఉద్యోగుల జీత భత్యాలు తదితర అవసరాలకు నిధుల సమస్య ఎదురవుతోంది. ఇవాళ జరగనున్న సమావేశంలో తితిదే ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు.
తితిదే సమావేశం అజెండాలోని అంశాలు
- శ్రీవారి ఆలయ మహద్వారం తలుపులు, ధ్వజస్తంభం పీఠానికి 6.6 కిలోల బంగారం తాపడం
- అన్నప్రసాదం సముదాయంలో 321 మంది కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి మరో ఏడాది పొడిగింపు
- లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ బకాయి పడ్డ రూ.81 లక్షల లీజు మొత్తం రద్దు
- రూ.2.44 కోట్ల వ్యయంతో శ్రీవారి అలంకరణకు ఏడాదికి సరిపడిన పుష్పాలు కొనుగోలు
- స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి పనులకు రూ.7 కోట్లు కేటాయింపు
- చెన్నైలో కోటి 10 లక్షల రూపాయల వ్యయంతో పద్మావతి అమ్మవారి ఆలయం రాజగోపురం నిర్మాణం
- రూ.7.66 కోట్ల వ్యయంతో యస్.యన్.సి, ఎ.ఎన్.సి కాటేజీల ఆధునీకరణ
- రూ.7.6 కోట్లతో బాలమందిరంలో అదనపు వసతిగృహం నిర్మాణం
- ప్రకాశం జిల్లా ముండ్లమూరు, దర్శి, కడప జిల్లా ఆకేపాడు, రాయచోటిలలో తితిదే కల్యాణ మండపాలు నిర్మాణం
- బర్డ్ ఆసుపత్రిలో రూ.9.3 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు
- రూ.9.1 కోట్ల వ్యయంతో తిరుమలలో అవుటర్ కారిడార్ నిర్మాణం
- రూ.6 కోట్ల వ్యయంతో తిరుపతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం
- రూ.3.6 కోట్లతో ప్రకాశం జిల్లా అద్దంకిలో వేంకటేశ్వర స్వామి ఆలయం పునరుద్ధరణ
- రూ.3 కోట్ల వ్యయంతో కడప జిల్లా జమ్మలమడుగులో నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులు
- ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుకు దాతల అందించిన విరాళాలు వినియోగంపై గైడ్ లైన్స్ రూపకల్పన
- 11.7 కిలోల బంగారంతో పద్మావతి అమ్మవారికి సూర్యప్రభ వాహనం
గడచిన మూడు నెలల కాలంలో అన్నదానంతో పాటు....శ్రీవారి నైవేద్యాలు, లడ్డు ప్రసాదాల తయారీకి కొనుగోలు చేసిన సరకుల మొత్తాల చెల్లింపునకు సమావేశం ఆమోదం తెలపనుంది. ధర్మకర్తల మండలి సమావేశాన్ని ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఇదీ చదవండి :విపత్తు సాయం కోసం 3 నెలలు ఆగాలా..?: చంద్రబాబు