ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD BUDGET: తితిదే బడ్జెట్ 3,096 కోట్లు...త్వరలో ఆర్జిత సేవల పునరుద్ధరణ - తితిదే బడ్జెట్

TTD BUDGET: తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 ఏడాదిగానూ రూపొందించిన 3 వేల 96 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోద ముద్ర వేసింది. త్వర‌లోనే స‌ర్వ ద‌ర్శనం, శీఘ్ర ద‌ర్శనం, శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు పున‌రుద్ధరించాలని బోర్డు తీర్మానించింది. పలు పథకాలు, అభివృద్ధి పనులపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన తితిదే ఛైర్మన్‌......ఈ నెలాఖరులోగా తిరుమలలో సాధారణ పరిస్థితులు తెస్తామని తెలిపారు.

తితిదే బడ్జెట్ 3,096 కోట్లు
తితిదే బడ్జెట్ 3,096 కోట్లు

By

Published : Feb 18, 2022, 4:00 AM IST

Updated : Feb 18, 2022, 6:44 AM IST

తితిదే బడ్జెట్ 3,096 కోట్లు

TTD BUDGET: కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలను సడలించిన నేపథ్యంలో శ్రీవారి ఆర్జిత సేవలను తక్షణమే పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీసుబ్బారెడ్డి తెలిపారు. ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో జవహర్‌రెడ్డి, ఎక్స్‌అఫీషియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్జిత సేవలకు సంబంధించి సిఫార్సు లేఖలపై ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. క్రమంగా సర్వదర్శన, నడక దారి భక్తుల టోకెన్ల సంఖ్యను పెంచనున్నట్లు స్పష్టం చేశారు. తితిదే ధర్మకర్తల మండలి చేసిన తీర్మానాలను వెల్లడించారు.

*తితిదే 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ రూ.3,096.40 కోట్ల అంచనాలతో ఆమోదం.

*పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని రూ.230 కోట్లతో రెండేళ్లలో పూర్తిస్థాయి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా మార్పు. ఇందుకు త్వరలోనే సీఎం జగన్‌ భూమిపూజ చేస్తారు. వైద్య పరికరాల కొనుగోలుకు నిపుణుల కమిటీ ఏర్పాటు.

*తిరుమలలో ప్రైవేటు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు లేకుండా ప్రధాని స్థాయి నుంచి సామాన్యుల వరకూ ఒకే వంటశాల భోజనం అందిస్తాం. తొలుత హోటళ్లను తొలగిస్తాం. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపి ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలను మూసివేస్తాం. అన్ని ముఖ్య ప్రాంతాల్లోనూ ఉచిత అన్నప్రసాదం పంపిణీ.

*అలిపిరిలో సైన్స్‌ సిటీకి ఇచ్చిన 70 ఎకరాల్లో 50ఎకరాలను ఆధ్యాత్మిక నగర నిర్మాణానికి కేటాయింపు.

*శ్రీవారి ఆలయంతో పాటు మహద్వారాలకు వేసిన బంగారు తాపడాల పునరుద్ధరణకు నిర్ణయం. ఆనంద నిలయం విషయమై ఆగమ, వేదపండితుల సలహాల స్వీకరణకు నిర్ణయం.

*అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని తీర్మానించాం. రెండు, మూడు నెలల్లోనే అందుబాటులోకి తెస్తాం.

*ముంబయిలోని శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం భూమి కేటాయించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఆలయ నిర్మాణం చేపడతాం.
తరుగుతున్న శ్రీవారి బ్యాంకు బ్యాలెన్సు..! శ్రీవారి బ్యాంకు ఖాతా నిల్వలు తగ్గిపోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. సవరించిన అంచనాల మేరకు 2021-22లో ప్రారంభ నిల్వలు/బ్యాంకు బ్యాలెన్సు రూ.376.42 కోట్లుగా..2022-23లో రూ.196.87 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. అంటే సుమారు రూ.179.55 కోట్లు తగ్గనున్నాయి. కొవిడ్‌ కారణంగా ఆదాయం తగ్గిందని పేర్కొంటున్నారు.

*2021-22 బడ్జెట్‌లో హుండీ, ఇతర మూలధనం ద్వారా రూ.1,131 కోట్లు వస్తుందని అంచనా వేయగా.. రూ.933 కోట్లు వస్తుందని భావిస్తున్నారు. ఇక్కడే రూ.198 కోట్ల మేర కోతపడింది.

*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ కింద రూ.634.32 కోట్లు, రానున్న ఏడాదిలో రూ.668.51 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. వడ్డీ ద్వారా రూ.34.19 కోట్లు అధికంగా రానుంది.

*వాస్తవానికి 2021-22 బడ్జెట్‌ అంచనా రూ.2,937.82 కోట్లు కాగా.. సవరించిన అంచనాల మేరకు రూ.3,000.76 కోట్లు వస్తుందని భావిస్తున్నారు. వాస్తవ అంచనాల కంటే ఇది రూ.62.94 కోట్ల మేరకు పెరిగింది. ఇందులో హుండీ, ఇతర మూలధనం ద్వారా ఏకంగా రూ.వెయ్యి కోట్లు వస్తుందని అంచనా వేశారు.

ఉదయాస్తమాన సేవాటికెట్ల ద్వారా రూ.85 కోట్ల విరాళం

ఉదయాస్తమాన సేవాటికెట్ల ద్వారా తితిదేకు రూ.85 కోట్లు విరాళంగా అందిందని తితిదే ఛైర్మన్‌ తెలిపారు. అందులో శుక్రవారానికి సంబంధించిన టికెట్లు పూర్తిగా భక్తులు కొనుగోలు చేశారని వెల్లడించారు. తిరుపతిలో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భక్తుల నుంచి ఇలా విరాళంగా స్వీకరించి వారికి ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేశామని తెలిపారు.

జిల్లాకు తిరుపతి పేరు పెట్టాలి

కొత్తగా ఏర్పడే జిల్లాకు శ్రీబాలాజీ జిల్లా కాకుండా తిరుపతి పేరు పెట్టాలని తితిదే ధర్మకర్తల మండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. బాలాజీ బదులు వేంకటేశ్వరస్వామి లేదా శ్రీనివాస జిల్లా అనే పేర్లను సూచిద్దామా అంటూ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అనగా, తిరుమల వచ్చే భక్తులు తిరుపతి వెళ్తున్నామని చెబుతారని అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. కొత్త జిల్లాకు తిరుపతి పేరునే పెట్టాలని ప్రభుత్వానికి నివేదిద్దామని నిర్ణయించారు.

సిఫార్సు లేఖల ఆర్జిత సేవలపై బాదుడు..!

సిఫార్సు లేఖల ద్వారా ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులపై భారీగా భారం పడనుంది. సిఫార్సు లేఖలను తగ్గించేందుకు ధరలు పెంచాలని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి గురువారం జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. సుప్రభాతం ఒక్కో టికెట్టు ధర రూ.2 వేలు, తోమాల, అర్చనలకు రూ.5 వేలు, కల్యాణోత్సవం రూ.2,500, వేద ఆశీర్వచనం రూ.10వేల చొప్పున చేయాలని సూచించారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఛైర్మన్‌ వెల్లడించారు.

రూ.9.20 కోట్ల విరాళం

చెన్నై మైలాపూర్‌కు చెందిన డాక్టర్‌ పర్వతం పేరిట ఉన్న రూ.9.20 కోట్ల విలువైన ఆస్తులు, నగదు డిపాజిట్లను ఆమె సోదరి రేవతి విశ్వనాథం తితిదేకు విరాళంగా ఇచ్చారు. పర్వతం చనిపోవడంతో ఆమె జ్ఞాపకార్థం రేవతి విశ్వనాథం ఈ ఆస్తిని శ్రీవారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఇదీ చదవండి:

వనం నుంచి జనంలోకి.. మేడారం గద్దెల మీదకు సమ్మక్క..

Last Updated : Feb 18, 2022, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details