తిరుమల అన్నమయ్య భవనం వేదికగా తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ఇవాళ జరగనుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 52 అంశాలతో కూడిన సుదీర్ఘ అజెండాతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సెప్టెంబర్ నెలలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణ, శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య పెంపు అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు మూడు నెలల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేయడం....లాక్‌డౌన్ సడలింపు అనంతరం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతి వంటి సమస్యలతో తితిదే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆలయ నిర్వహణ, తితిదే ఉద్యోగుల జీతభత్యాల అంశాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇవాళ జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నారు.
నిధులు డ్రా పై చర్చ
ఆగస్టు నెల జీతాల చెల్లింపు వరకు ఆర్థిక ఇబ్బందులు లేవని, సెప్టెంబర్ జీతాలకు సబంధించి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఈవో ప్రకటించారు. దీంతో ఇవాళ్టి సమావేశంలో కార్పస్ ఫండ్ డ్రా చేయడానికి ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేయనుంది. రోజుకు తొమ్మిది వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తుండగా ఈ సంఖ్యను 20 వేలకు పెంచే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు.