ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల కొండపై... తాగునీటికి కటకట

తిరుమల లేపాక్షి సర్కిల్‌లోని ఓ దుకాణంలో రోజుకు కనీసం 25 కేసుల నీటి సీసాలను విక్రయించేవారు. కొద్ది రోజులుగా అవసరానికి సరిపడా నీటి సీసాలు రావడం లేదు. రోజుకు నాలుగైదు కేసులు మాత్రమే సరఫరా అవుతున్నాయని దుకాణదారు వాపోతున్నారు. ఏటీసీ ప్రాంతంలోని ఒక వ్యాపారికి రోజూ కనీసం 15 కేసుల నీటి సీసాలు అవసరం. ఇప్పుడు నాలుగైదు కేసులు మాత్రమే వస్తున్నాయి. తనకు రోజూ 40 కేసులు అవసరమని, ఇప్పుడు సగం కూడా రావడం లేదని వరాహస్వామి అతిథిగృహం ప్రాంతంలోని ఒక దుకాణదారు చెప్పారు.

By

Published : Apr 13, 2021, 8:59 AM IST

జల ప్రసాదంలో నీరు రాక వెనదిరుగుతున్న వ్యక్తి
జల ప్రసాదంలో నీరు రాక వెనదిరుగుతున్న వ్యక్తి

తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా తితిదే ప్లాస్టిక్‌ను నిషేధించింది. ఎక్కడా ప్లాస్టిక్‌ బాటిళ్లను వినియోగించకూడదని ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా గాజు సీసాలను వాడేందుకు అనుమతించింది. కొండపై వివిధ ప్రాంతాల్లో జలప్రసాదాలను ఏర్పాటు చేసింది. పర్యావరణ రక్షణ ఉద్దేశం బాగానే ఉన్నా ప్రస్తుతం నీటి సీసాలు తగినంతగా లభించక భక్తులు అల్లాడుతున్నారు. ప్రత్యామ్నాయంగా శీతల పానీయాలను కొనుక్కుంటున్నారు. 2 రోజులకోసారి నీటి సీసాలను సరఫరా చేస్తున్నారని, అవి అవసరాలను తీర్చడం లేదని దుకాణదారులే పేర్కొంటున్నారు. వచ్చే 2 నెలల్లో ఎండలు మరింత ముదరనున్నందున ప్రజల దాహార్తిని తీర్చేందుకు తితిదే ప్రత్యామ్నాయ మార్గాలను వెదకాల్సి ఉంది.

అవసరాలకు అనుగుణంగా సరఫరా లేదు..

తిరుమలకు ప్రస్తుతం రోజూ 45 వేల నుంచి 50 వేల మంది భక్తులు వస్తున్నారు. సాధారణంగా రోజుకు 3 వేల నుంచి 4 వేల కేసుల నీటి సీసాలు అవసరం. ఈ మేరకు గతంలో ప్లాస్టిక్‌ బాటిళ్లు అందుబాటులో ఉండేవి. వాటి స్థానంలో తొలి రోజుల్లో గాజు సీసాల సరఫరా బాగానే ఉండేది. ఇప్పుడు వాటి సరఫరా తగినంత లేదు. కొవిడ్‌ నిబంధనల సడలింపు తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతున్నందున నీటి సమస్య మొదలైంది. అవసరమైన మేరకు నీటి సీసాల సరఫరాలో పంపిణీదారులు విఫలమయ్యారు. ఇప్పుడు రోజుకు 400 నుంచి 500 కేసులు మాత్రమే తిరుమలకు వస్తున్నాయి.

జలప్రసాదాలే దిక్కు

తితిదే ఏర్పాటుచేసిన జలప్రసాదాల వద్ద అపరిశుభ్రత కనిపిస్తోంది. భక్తులకు సరైన అవగాహన లేక అక్కడే ఉమ్మడం, ఆహార వ్యర్థాలను నీటి కొళాయిల వద్దే పడేయడం వంటివి చేస్తున్నారు. మరోవైపు జనసమ్మర్థమున్న ప్రాంతాల్లోని జలప్రసాదాల్లో నీటి కొరత ఏర్పడుతోంది. కొన్ని పెద్ద అతిథిగృహాల్లో వాటర్‌ డిస్పెన్సరీలు ఉన్నప్పటికీ.. ఎస్‌ఎంసీ, ఎస్‌ఎన్‌సీ వంటి విడివిడిగా ఉన్న వసతి గృహాల్లో లేవు. వారు జలప్రసాదం వరకూ వెళ్లాల్సి వస్తోంది. తిరుమల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాటర్‌ డిస్పెన్సరీలను ఏర్పాటుచేయాల్సి ఉంది.

ఇదీ చదవండి:

వాలంటీర్లు భేష్‌... 20 నెలల్లో ఎనలేని సేవలు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details