ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హనుమంతుడి జన్మస్థానం...అంజనాద్రే

హనుమంతుడి జన్మస్థానంపై తితిదే ప్రకటన
హనుమంతుడి జన్మస్థానంపై తితిదే ప్రకటన

By

Published : Apr 21, 2021, 11:30 AM IST

Updated : Apr 21, 2021, 7:23 PM IST

11:28 April 21

హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని నిర్ధరణ

హనుమంతుడి జన్మస్థానంపై తితిదే ప్రకటన

శ్రీరామనవమి పర్వదినం రోజున వేంకటాచలాన్నే...ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రిగా ప్రకటిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన చేసింది. తిరుమల నాదనీరాజనం మండపంలో తితిదే అధికారులతో కలిసి సమావేశమైన పండితుల కమిటీ..ఈ మేరకు తమ పరిశోధనల ఫలితాన్ని వెలువరించింది. చారిత్రక, వాంజ్ఞ్మయ, భౌగోళిక, శాసనపరమైన ఆధారాలను క్షుణ్నంగా పరిశోధించిన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు పండితుల కమిటీ తెలిపింది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి హనుమత్ జన్మస్థానంపై వినిపిస్తున్న వాదనలను తోసిపుచ్చుతూ వేంకటాద్రే అంజనాద్రిగా నిర్ధారించింది.

వాయునందనుడు, అతులిత బలధాముడు ఆంజనేయుడి జన్మస్థానంగా ఆకాశగంగ సమీపంలోని జాపాలి తీర్థాన్ని నిర్థారిస్తూ తితిదే ఏర్పాటు చేసిన పండితుల కమిటీ ప్రకటించింది. పురాణ, ఇతిహాస, చారిత్రక ఆధారాలను నాలుగు నెలల పాటు పరిశోధించిన పండితుల కమిటీ.. ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. పండితుల కమిటీ తరపున తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధరశర్మ పరిశోధనల ఫలితాన్ని తిరుమల నాదనీరాజన మండపం వేదికగా ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్, తితిదే ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, తితిదే ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్ట్ అధికారి విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వీసీ మురళీధరశర్మ.. అయోధ్యలో శ్రీరామచంద్రుని భవ్యమందిరం నిర్మితమవుతున్న తరుణాన ఆయనకు ప్రీతిపాత్రుడైన హనుమంతుని జన్మస్థానంపై సంకల్పం తీసుకున్నామన్నారు. శాసన, భౌగోళిక, పౌరాణిక, వాంజ్ఞ్మయ ఆధారంగా ఆంజనేయుని జన్మస్థానంపై అధికారిక ప్రకటన చేస్తున్నామన్నారు.

త్రేతాయుగంలో వేంకటచలమే అంజనాద్రి..

ఆంజనేయ జన్మస్థానంపై నాలుగు రకాల ఆధారాలను పరిగణనలోకి తీసుకున్నామన్న మురళీధర శర్మ.. వెంకటాచల మహాత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామన్నారు. వేంకటచలానికే అంజనాద్రితో పాటు మరో 20 పేర్ల ప్రస్తావన ఆ పురాణంలో ఉందన్న ఆయన.. త్రేతాయుగంలో వేంకటాచలాన్ని అంజనాద్రిగా పిలిచేవారని భవిష్యోత్తర పురాణంలోనూ ఉందన్నారు. అంజనాదేవికి తపోఫలంగా అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాడని.. ఆంజనేయుడికి ఆకలి వేసి సూర్యబింబం కోసం ఎగిరిన వర్ణనలు వేంకటచలానికి సరిపోలుతున్నాయని ఆయన తెలిపారు. మొత్తం 12పురాణాలు ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని చెబుతున్నాయన్నారు.

కంబరామాయణంలోనూ అంజనాద్రి ప్రస్తావన..

వాంజ్ఞ్మయ ఆధారంగా.. 12, 13 శతాబ్దం నాటికే ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉందన్న మురళీధర శర్మ.. వాల్మీకి రామాయణం తర్జుమా కంబరామాయణంలోనూ అంజనాద్రి ప్రస్తావన ఉందన్నారు. అన్నమయ్య కీర్తనల్లోనూ వేంకటాచలాన్ని అంజనాద్రిగా వర్ణించినట్లు ఆధారాలున్నాయన్నారు. వెంకటాచల మహాత్యమే తిరుమలలో ప్రామాణికమని రెండు శాసనాల్లో ఉందని ఉపకులపతి అన్నారు. శ్రీరంగం.. రంగనాథుని ఉత్సవ విగ్రహాలు కొంతకాలంపాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉంచారని గుర్తు చేశారు.  

కాంచీపురం వరదరాజస్వామి ఆలయాల్లోనూ.. 

రంగనాయకుల మండపం నుంచి తిరిగి వాటిని శ్రీరంగం తీసుకువెళ్లినప్పుడు తిరుమలలోని అంజనాద్రి నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చినట్లు శ్రీరంగం శాసనంలో స్పష్టంగా ఉందన్నారు. కాంచీపురం వరదరాజ స్వామి ఆలయ శాసనాల్లోనూ అంజనాద్రి గురించి వివరాలున్నాయన్నారు. నాటి నార్త్ అర్కాట్ జిల్లా కలెక్టర్  తిరుమల ఆలయ వైభవంపై పుస్తకం రాయించారని తెలిపిన మురళీధర శర్మ..అందులో అంజనాద్రిగానే తిరుమలను వర్ణించినట్లు శాసనపరమైన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

4 నెలల అధ్యయనం తర్వాత..

ఈ అంశంపై భౌగోళిక ఆధారాలనూ పరిశీలించామన్న పండితులు.. కిష్కింధ నుంచి 220 నాటికన్ మైళ్ల దూరంలో తిరుమల ఉందన్నారు. విజయనగర రాజధాని హంపీ.. వాలి ఏలిన కిష్కింధ కాబట్టి వానర సైన్యం ఆనవాళ్లు ఉండొచ్చన్న పండితులు..కానీ ఆ ప్రాంతం మాత్రం అంజనాద్రి కాదని స్పష్టం చేశారు. మాతంగ మహర్షి.. అంజనాదేవిని స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని ఆరాధించమని చెప్పినట్లు ఉందన్న పండితులు..వైకుంఠం గుహ శ్రీవారి పుష్కరిణి పక్కనే ఉందని త్రేతా యుగంలో చెప్పినట్లు వరాహపురాణం చెబుతోందన్నారు. అన్ని ఆధారాలనూ  4నెలల పాటు అధ్యయనం చేసి వేంకటాచలాన్నే అంజనాద్రిగా పండితుల కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిందని స్పష్టం చేసిన మురళీధర శర్మ..ఆకాశ గంగ సమీపంలోని జాపాలి తీర్థమే ఆంజనేయ జన్మస్థలంగా తేల్చి చెప్పారు.  దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంజనేయుడి జన్మస్థానంపై వస్తున్న వాదనలను తోసిపుచ్చిన పండితుల కమిటీ..మిగిలిన ప్రాంతాలను పోల్చితే వేంకటాచలమే అంజనాద్రి అని ప్రకటించడానికి కావాల్సిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. 

ఇదీ చదవండి: 

ప్రజలకు గవర్నర్, సీఎం శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Last Updated : Apr 21, 2021, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details