లాక్డౌన్ కారణంగా ఆహారం అందక ఇబ్బంది పడుతున్న మూగజీవాలను ఆదుకునే విధంగా తిరుపతిలో నగరపాలక సంస్థ అధికారులు.. స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో రహదారులపై ఆకలితో అలమటిస్తున్న గోవులను ఒకే చోటుకి చేర్చిన నగరపాలక సంస్థ అధికారులు.. తితిదేతో కలిసి వాటి ఆకలి తీర్చే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నగరంలోని బాలాజీ లింక్ బస్టాండ్ ఆవరణలో మూగజీవాల కోసం ప్రత్యేకంగా ఆవాసం కల్పించారు. వాటికి ఆహారం అందిస్తున్నారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వెటర్నరీ అధికారులు వాటి సంక్షేమాన్ని చూస్తుండగా.. తితిదే గోశాల నుంచి నిత్యం ఒక టన్ను పశుగ్రాసం, 350 కిలోల దాణాను అందిస్తున్నారు. తిరుపతి సిటీ ఛాంబర్ సభ్యులు ఆవుల కోసం.. దాణా, కూరగాయలు, పుచ్చకాయలు ఆహారంగా పెడుతున్నారు. సుమారు 53 గోవుల ఆలనాపాలనా చూస్తున్నారు. లాక్డౌన్ ముగిసే వరకూ వాటి ఆకలిని తీర్చేలా కృషి చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు చెప్పారు.