మూడో తరం ఐఐటీల్లో భాగంగా తిరుపతిలో ఏర్పాటైన ఇనిస్టిట్యూట్... సౌకర్యాలు, అవకాశాలపరంగా అత్యున్నతంగా ఉందని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ చెబుతున్నారు. ఈ ఏడాది జేఈఈ కౌన్సెలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో.... తిరుపతి ఐఐటీలోని సదుపాయాల గురించి సత్యనారాయణ ఈటీవీ భారత్‌కు వివరించారు.
బీటెక్‌లో మూడేళ్ల తర్వాత డ్యుయల్ డిగ్రీకి అవకాశం: తిరుపతి ఐఐటీ డైరెక్టర్ - jee counseling latest news
ఈ ఏడాది జేఈఈ కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరునగరిలో ఏర్పాటైన ఐఐటీ-తిరుపతి నూతన విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. మూడో తరం ఐఐటీ కావటంతో అత్యాధునిక సదుపాయాలతో నవీనత ఉట్టిపడేలా మౌలిక వసతుల కల్పన, విద్యాబోధన అందిస్తున్నామంటున్నారు తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ.
సరికొత్త ఆలోచనలతో విద్యార్థులకు చేరువగా తిరుపతి ఐఐటీ ఉంది. బీటెక్ విద్యలో ఐదు రకాల కోర్సులు ఉన్నాయి. విద్యార్థి బీటెక్‌లో ప్రతిభ కనబరిస్తే మూడేళ్ల తర్వాత డ్యుయల్ డిగ్రీకి అవకాశం కల్పిస్తాం. దీనివల్ల ఐదేళ్లలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేయవచ్చు. మంచి అధ్యాపక సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉన్నారు. కొవిడ్ ప్రభావంతో మార్చి నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు బ్యాచ్‌ల వారీగా విద్యార్థులను అనుమతిస్తున్నాం. 30-40 మందిని బ్యాచ్‌లుగా రప్పించి క్వారంటైన్ పూర్తయ్యాక పరీక్షలు చేసి క్యాంపస్‌లోకి అనుమతిస్తున్నాం. తొలి ఏడాది విద్యార్థులకు మొదట ఆన్‌లైన్ ద్వారానే బోధన ఉంటుంది. మరోవైపు ఐఐటీలో ట్రెండ్‌కు తగ్గట్టు సిలబస్‌లో మార్పులు చేర్పులు ఉంటాయి. విభిన్న అంశాల్లో విద్యార్థికి ప్రతిభ చాటుకునే అవకాశం కల్పిస్తాం. ప్రతి విద్యార్థీ తప్పక ఎన్‌ఎస్‌ఎస్‌లో భాగమవ్వాలి. వార్షికాదాయం తక్కువున్న వారికి ఫీజు మినహాయింపు ఉంటుంది. ప్లేస్‌మెంట్స్‌పై ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు- ప్రొఫెసర్ సత్యనారాయణ, తిరుపతి ఐఐటీ డైరెక్టర్