ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ కానిస్టేబుల్​ ఇల్లే.. ఓ మ్యూజియం!

రాత్రీ పగలు తేడా తెలియని ఉద్యోగం....నిద్రహారాలు మాని శాంతి భద్రతల కోసం పాటు పడే కర్తవ్యం...ఇదీ పోలీసు ఉద్యోగానికి నిర్వచనం. కానీ చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఓ పోలీస్ మాత్రం చాలా ప్రత్యేకం. ఎంతలా అంటే పని ఒత్తిడిలోనూ... మరో అభిరుచిని ఏర్పరచుకునేంతలా. శతాబ్దాల చరిత్రను సమీకరించే ప్రయత్నం చేసేంతలా. ఏంటా ప్రయత్నం...ఎవరా పోలీస్....తెలుసుకోవాలనుందా?

By

Published : Oct 21, 2019, 7:33 AM IST

Updated : Oct 21, 2019, 9:01 AM IST

traffic constable Collecting old coins

ఆ కానిస్టేబుల్​ ఇల్లే.. ఓ మ్యూజియం!

సురేష్ రెడ్డి..ఓ సాదా సీదా ట్రాఫిక్​ కానిస్టేబుల్. తిరుపతిలోని బాలాజీ సర్కిల్ పోలీస్ క్వార్టర్స్​లో నివాసం ఉంటారు. ఈ కానిస్టేబుల్​కు మరో పేరు డాలర్ సురేష్. ఆ పేరు వెనక మూడు దశాబ్దాల పాటు పడిన కఠోర శ్రమ ఉంది. సాధారణంగా పోలీసు అంటే పని ఒత్తిడి ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎక్కువ సమయం ఇంటి బయటే గడపాల్సి ఉంటుంది. అయినా తనకంటూ ఓ విభిన్నమైన అభిరుచిని ఏర్పరుచుకున్న.. సురేష్ రెడ్డి ఆ దిశగా కృషి చేస్తున్నారు.

కుమారుడి ఆరోగ్యం బాగాలేక మళ్లీ..!
శతాబ్దాల చరిత్ర ఉన్న పాత నాణేలు, కరెన్సీ, రాజ పత్రాలు, శాసన లేఖలు, స్టాంపులు సేకరించే అలవాటు చేసుకున్నారు సురేష్ రెడ్డి. ఆరోతరగతి చదువుతున్నప్పటి నుంచే పాత నాణేల సేకరణ ప్రారంభించిన సురేష్ రెడ్డి....ఆ తర్వాత ఉద్యోగంలో చేరేంత వరకూ వాటిని పక్కన పెట్టేశారు. వివాహం తర్వాత....తన కుమారుడి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఆ బాధను దిగమింగేందుకు తిరిగి తన పాత అభిరుచికి పని పెట్టారు సురేష్ రెడ్డి.

ఇల్లు ఓ మ్యూజియం
నాణేలను చాలామంది సేకరిస్తారు. కానీ వాటి గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోవటం అనే విషయంపై దృష్టి సారించరు. కానీ సురేష్ అందుకు భిన్నం. తాను సేకరించిన ప్రతీ నాణేనికీ, వస్తువుకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అలా సేకరించిన నాణేలు, పాత వస్తువులు, ఫోన్లు, గ్రామ్ ఫోన్​లతో ఆయన ఇల్లే ఓ మ్యూజియం ఇప్పుడు. అవన్నీ పరిశీలించాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది. క్రీస్తు పూర్వం నాటి నాణేలతో మొదలు పెట్టి ఇప్పటివరకూ 50 పైచిలుకు ప్రఖ్యాతిగాంచిన రాజ్యవంశాలు విడుదల చేసిన నాణేలు సేకరించారు.

180 దేశాల కరెన్సీ సేకరణ
కేవలం నాణేల సేకరణకే పరిమితం కాకుండా రాజపత్రాలు, పురాతన కాలం నాటి అధికారిక లేఖలను సేకరించటం సురేష్ రెడ్డికున్న మరో ప్రత్యేకత. 180 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీని రెడ్డి సమీకరించారు. ఇందుకోసం తన సంపాదనలో వచ్చే... ప్రతి రూపాయిని ఖర్చు చేస్తారు. దేశం నలుమూలలా జరిగే పురాతన వస్తువుల, నాణేల వేలం పాటలో స్వయంగా సురేష్ రెడ్డి పాల్గొంటాడు.

ప్రభుత్వం సాయమందిస్తే..!
పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక సందర్భాల్లో ప్రదర్శించటం ద్వారా పిల్లలకు ఈ విజ్ఞానాన్ని పరిచయం చేస్తున్నాడు. నాణేల సేకర్తలకు వేదికలాంటి న్యూమిస్ మాటిక్స్ సొసైటీ తిరుపతికి పదిహేనేళ్లుగా గౌరవ అధ్యక్షుడిగా సైతం సేవలందిస్తున్నాడు. తన అభిరుచికి తోడు ప్రభుత్వం సాయమందిస్తే ఈ విజ్ఞానాన్ని ఓ మ్యూజియం రూపంలో భావితరాలకు అందించాలనేది సురేష్ రెడ్డి తపన.

ఇదీ చదవండి:రైతన్నల కష్టాలు చూశాడు.. కలుపు యంత్రం తయారు చేశాడు!

Last Updated : Oct 21, 2019, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details