నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. చెన్నైకి ఆగ్నేయ దిశగా 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న వాయుగుండం.. రేపు ఉదయానికి చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
చిత్తూరు జిల్లాలో..
తిరుపతిని భారీ వర్షం ముంచెత్తుతుంది. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ రేపు సెలవు(Holiday for educational institutions in Chittoor district due to heavy rains) ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి తిరుపతి నగరంలోని(rain at tirumala) లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు అలిపిరి నడక మార్గం నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది. నీటి ప్రవాహంతో మెట్ల మార్గం జలపాతంలా కనిపిస్తోంది. తితిదే ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా నడక మార్గంలో భక్తుల అనుమతిని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. కొండ పైనుంచి వస్తున్న నీటితో కపిలేశ్వరాలయం వద్ద ఉద్ధృతంగా నీటి ప్రవాహం ఉంది.
తిరుమల కొండల్లో కురిసిన భారీ వర్షంతో కపిల తీర్థం, మల్వాడి గుండం జలపాతలు ఉద్ధృతంగా ప్రవహిస్తూ కాలువల పరివాహక ప్రాంతాలను ముంపునకు గురిచేశాయి. ప్రధాన రహదారులలో నీటమునిగి రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. లక్ష్మీపురం కూడలి, దేవేంద్ర థియేటర్ కూడలి, కరకంబాడి రోడ్డు, తిరుచానూరు రోడ్డు జలమయమయ్యాయి. అయితే ఈదురుగాలులు లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదు. నగరపాలక, విద్యుత్ శాఖ, పోలీస్, రెవిన్యూ అధికారులు అప్రమత్తం చేసినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు.
శ్రీకాళహస్తిలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తడంతో ఏర్పేడు-సదాశివ పురం, శ్రీకాళహస్తి - పాపా నాయుడు పేట, గుడిమల్లం-శ్రీకాళహస్తి, పంగురు-శ్రీకాళహస్తి, వెంకటగిరి ప్రధాన రహదారులపై కాజ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ముందస్తుగా ఈ రహదారులపై రాకపోకలను నియంత్రించారు. పలు చెరువులు పూర్తి స్థాయిలో నుండి ప్రమాదాన్ని తలపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలో..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షం(heavy rains at nellore district) కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి(rains in nellore district). ఈ వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరి పలు ప్రాంతాల్లో నారుమళ్లు, ఆకుకూర తోటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.