తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవలకు సంబంధించిన టిక్కెట్లను తితిదే నేటి నుంచి ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానుంది. స్వామి వారి కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వర్చువల్ సేవలకు సంబంధించి నవంబర్ 22 నుంచి 30 తేదీ వరకూ టిక్కెట్ల కోటాను ఉదయం 11గంటలకు తితిదే వెబ్ సైట్ లో విడుదల చేయనున్నారు.
వెయ్యి రూపాయలు చెల్లించి ఆన్ లైన్ లో కల్యాణోత్సవం టికెట్లు పొందిన గృహస్థులకు ఆ టికెట్ పై ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు తితిదే ప్రకటించింది. డోలోత్సవం, ఆర్జిత బ్రహోత్సవం, సహస్రదీపాలంకరణ సేవల టిక్కెట్లు పొందిన వారు మాత్రం దర్శనం కోసం 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. టికెట్లు బుక్ చేసుకున్న తేదీ నుంచి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని తితిదే భక్తులకు కల్పిస్తోంది. సేవా టిక్కెట్ల బుకింగ్ సమయంలోనే దర్శనం చేసుకోవాలనుకునే తేదీని భక్తులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నుంచి ఆర్జిత సేవల టిక్కెట్లను ప్రతి నెలా ఆఖరి వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.