వర్షాలు తగ్గినప్పటికీ తిరుపతి(Tirupati Submerged With Flood Water Due to Heavy Rains) నగరానికి వరద ముప్పు కొనసాగుతోంది. మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. కొన్ని కోట్ల చెరువు కట్టలు తెగి నగరంలోకి వరదనీరు చేరుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కొంతమేర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. వరద ప్రభావంతో తిరుమల కాలినడక మార్గమైన శ్రీవారి మెట్టు ప్రాంతం పూర్తిగా దెబ్బతింది. అలిపిరి కాలినడక మార్గం పాక్షికంగా దెబ్బతినడంతో.. భక్తులను కాలినడక మార్గాల ద్వారా అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాలు మినహా.. భక్తులను ఇతర వాహనాలపై అనుమతిస్తున్నారు. వరదప్రభావంతో రైళ్లు, బస్సులను రద్దు చేయగా(train and bus services cancelled in tirupati).. మరి కొన్నింటిని దారిమళ్లించారు. ఆర్టీసీ బస్సులను దారిమళ్లించి తిరుమల, తిరుపతికి నడుపుతున్నారు.
ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటితో ఇంకా పలు కాలనీలు(Several Colonies Waterlogged Due to Heavy Rains) జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నగరంలోని మహిళా యూనివర్సిటీ, శ్రీ కృష్ణ నగర్, గాయత్రీ నగర్, ఎంఆర్ పల్లి, సరస్వతీ నగర్, గాంధీపురం, లింగేశ్వర కాలనీ, ఆటో నగర్‌తోపాటు పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతంలోని పేరూరు, పెరుమాళ్లలపల్లి చెరువులు నిండిపోవడంతో తిరుపతి శివార్లలోని పలు ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. ఇళ్లలోకి నీరు రావడంతో నీరు, తిండిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా తీవ్ర అవస్థలు పడుతున్నారు. జలదిగ్బంధంలోని కాలనీలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. నగరంలోని ఎంఆర్ పల్లి, శ్రీ క్రిష్ణ నగర్, సరస్వతీ నగర్‌లోని ఇళ్లలో చిక్కుకుపోయిన వారికి ఆహార పానియాలు అందజేస్తున్నారు. పడవ సహాయంతో కాలనీలలో వెళ్లిన వారు అవస్థలు పడుతున్న వారిని బయటికి తీసుకొస్తున్నారు.
మరో పక్క జలదిగ్బంధంలో ఉన్న నగరవాసుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలించింది. పాలు, బ్రెడ్, ఆహార పానియాలను ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ముంపునకు గురైన ప్రాంతాలలో పూర్తి స్థాయిలో బాదితులకు సహాయం అందక ఇబ్బందులు పడుతుంటే.. ముంపు నుంచి బయట పడిన ప్రాంతాల వాళ్లు అధికారులు, ప్రజాప్రతినిదులు తమవైపు చూడలేదని వాపోతున్నారు. వరదలో ఇంట్లో వస్తువులు, సర్వం కోల్పోయామని కన్నీటిపర్యంతమవుతున్నారు. కనీసం వీధుల్లో పేరుకుపోయిన బురద, కొట్టుకొచ్చి వస్తువులను తొలగించాలని కోరుతున్నారు.
ప్రమాదక పరిస్థితిలో రాయలచెరువు..
భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా అన్ని వాగులు, వంకలు, నదులలో వరద ప్రవాహం ఉద్ధృతంగా(rains in tirupati) కొనసాగుతోంది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు ప్రమాదక పరిస్థితుల్లో ఉందని.. కట్టతెగిపోయే పరిస్థితులు ఉండటంతో ఆ ప్రాంత గ్రామాల్లో అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.