ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైల్వే గేటుతో తంటా... పరిష్కారం ఎప్పుడంటా..? - ఏపీ టుడే న్యూస్

ఆ రైల్వే క్రాసింగ్ గేటు పడిందంటే చాలు... వాహనదారులు వెళ్లాలంటేనే జంకుతారు. పోనీ ధైర్యం చేసి వెళ్లారా... ఇక అంతే సంగతులు. ట్రాఫిక్ రద్దీలో ఇరుక్కుపోయి అవస్థలు పడాల్సిందే. ప్రభుత్వ శాఖల మధ్య ఏర్పడిన సమన్వయ లోపంతోనే ట్రాఫిక్‌ సమస్య కొలిక్కి రావడం లేదని నగరవాసులు అంటున్నారు.

Tirupati rayala cheruvu railway gate
Tirupati rayala cheruvu railway gate

By

Published : Oct 17, 2020, 5:18 PM IST

రైల్వే గేటుతో తంటా...పరిష్కారం ఎప్పుడంటా?

తిరుపతి-రాయలచెరువు మధ్య లెవల్ క్రాసింగ్ నెంబర్ 104 వద్ద... రైళ్లు ఎక్కువగా తిరిగే సమయంలో ఇక్కడ ట్రాఫిక్​కి ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గుంతకల్ రైల్వే డివిజన్​లో తిరుపతి రైల్వే స్టేషన్ అత్యంత కీలకమైనది. మామూలు రోజుల్లో ప్యాసింజర్, ఎక్స్​ప్రెస్​లు కలిపి రోజుకు 70 నుంచి 80 రైలు సర్వీసులు నడుస్తాయి. ఏడాదికి 200 కోట్ల రూపాయలు ఆదాయం ఆర్జిస్తూ... రాష్ట్రంలోనే అధిక రెవెన్యూ వచ్చే రైల్వే స్టేషన్ గా... జాతీయ స్థాయిలో ఏ1 గ్రేడ్ తో తిరుపతి రైల్వే ప్రయాణికులకు సేవలందిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా గడచిన 6 నెలలుగా రైల్వే సర్వీసులకు బ్రేక్ పడటం వల్ల ప్రస్తుతం రాయలసీమ స్పెషల్ ఎక్స్​ప్రెస్ రైలు మాత్రమే సర్వీసు కొనసాగిస్తోంది. కానీ రైల్వే స్టేషన్‌ను ఆనుకునే ఉన్న రాయల చెరువు రైల్వే గేటు సమస్య మాత్రం కొన్ని దశాబ్దాలుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది.

నిత్యం రద్దీ... ట్రాఫిక్​తో అష్టకష్టాలు..

తిరుపతిలోని మారుతీ నగర్, ఎమ్మార్ పల్లి, బైరాగిపట్టెడ, అన్నమయ్య సర్కిల్ ప్రాంతాలకు వెళ్లాలనుకునే... వారు అక్కడి నుంచి వచ్చే వారు కచ్చితంగా ఈ రాయలచెరువు రోడ్డు మార్గాన్నే అనుసరిస్తారు. ఈ గేటుకు సమీపంలోనే రైతుబజారు కూడా ఉండటం వల్ల... ఇక్కడ నిత్యం రద్దీ అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి 15-20 నిమిషాలకు ఓ సారి గేటు పడుతుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఇక్కడ రోడ్ అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని అధికారులు రెండున్నరేళ్ల క్రితం నిర్ణయించారు. రైల్వేశాఖతోపాటు స్మార్ట్ సిటీ మిషన్​లో భాగంగా తిరుపతి నగర పాలక సంస్థ సంయుక్తంగా 15 కోట్ల 30లక్షల రూపాయలతో అండర్ పాస్ నిర్మాణం కోసం ఏనాడో పనులు మొదలయ్యాయి. కానీ నేటికీ ఆ ఫలితాలు కనిపించక ట్రాఫిక్‌తో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

నిధుల విడుదలలో రైల్వేశాఖ జాప్యం..

కరోనా కారణంగా రైలు సర్వీసులు లేని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే... ఈ పాటికి నగరాన్ని సుదీర్ఘంగా పట్టి పీడిస్తున్న సమస్య తీరిపోయేదని నగరవాసులు అంటున్నారు. 2 కోట్ల రూపాయల నిధులతో ఈ పనిని ఇప్పటికే నగరపాలక సంస్థ దాదాపు పూర్తి చేసింది. కానీ నిధుల విడుదలకు సంబంధించి రైల్వే శాఖ పట్టనట్లు వ్యవహరిస్తుండటం వల్ల... నగరపాలక సంస్థ కొత్త పైపు లైన్ల అనుసంధాన పనులను నిలిపి వేసింది. బ్రిడ్జి నిర్మాణం తర్వాత ఒప్పందం ప్రకారం అప్రోచ్ రోడ్లు, రీటైనింగ్ గోడలను ఏర్పాటు చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం శాపంగా మారి... ట్రాఫిక్ రూపంలో వేధిస్తోందని నగరవాసులు అంటున్నారు.

ఇదీ చదవండి :'సీఎం ధోరణి.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం'

ABOUT THE AUTHOR

...view details