దేశంలోనే అత్యున్నత సాంకేతిక విద్యా నిపుణులను తీర్చిదిద్దాల్సిన సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఐఐటీ తిరుపతి, విజ్ఞాన శాస్త్ర రంగంలో అత్యున్నత పరిశోధక విద్యార్థులను తయారు చేయాల్సిన సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-ఐసర్ తిరుపతి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా ఇచ్చిన హామీల మేరకు కేంద్రం ఆధ్యాత్మిక నగరం తిరుపతికి కేటాయించిన ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యాసంస్థలివి. బాలారిష్టాలు అన్నీ దాటుకుని పనులు ప్రారంభమై ఆరేళ్లు కావస్తున్నా... ఇప్పటికీ ఈ విద్యాసంస్థలు శాశ్వత నిర్మాణాలను పూర్తి చేసుకోలేదు. కొంతలో కొంత మెరుగు అన్నట్లు ఐఐటీ తిరుపతి శాశ్వత భవనాల నిర్మాణాల్లో పురోగతి కనిపిస్తున్నా... పాలకుల నిర్లక్ష్యంతో పనులు వేగంగా జరగటం లేదని సమాచార హక్కు చట్టమే స్పష్టం చేస్తోంది. ఐసర్ తిరుపతి పరిస్థితి మరింత శోచనీయం. ఆరేళ్ల కిందటే శాశ్వత భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించినా.. ఒక్క పరిపాలనా భవనం తప్ప... మిగిలిన కార్యకలాపాలు అన్నీ అద్దెగదుల్లోనే కొనసాగుతుండడం.. క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతోంది.
గత ప్రభుత్వంలో శంకుస్థాపన
ఐఐటీ తిరుపతి విషయానికి వస్తే.. 2015 మార్చిలో కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అత్యున్నత విద్యా సంస్థకు శంకుస్థాపన చేశారు. 3 వేల 125 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ సంస్థ... తొలుత రేణిగుంట సమీపంలో తాత్కాలిక ప్రాంగణంలో ప్రారంభమైంది. అనంతరం ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద 566 ఎకరాల ప్రభుత్వ భూమిని నాటి చంద్రబాబు సర్కారు ఐఐటీకి కేటాయించింది. 8 కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించింది. ఇంత చేసినా... కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధుల్లో జాప్యం జరుగుతోందని పార్టీలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. అయినా.. ఫలితం లేకుండా పోతోంది.
ఐదేళ్ల కాలంలో.. విడుదలైన నిధులు రూ.555 కోట్లే...
2017-18 సంవత్సరంలో ఎన్డీఏ సర్కారు నుంచి తెదేపా బయటకు వచ్చిన సమయంలో కేంద్ర బడ్జెట్లో 98కోట్ల రూపాయలు ఐఐటీకి కేటాయించగా... 2018-19 బడ్జెట2లో 50 కోట్ల రూపాయల నిధులు మాత్రమే కేటాయించారు. ఐదేళ్ల కాలంలో కేవలం 555 కోట్ల రూపాయలు నిధులు మాత్రమే విడుదల కాగా... శాశ్వత తరగతి గదులు, వసతిగృహాలు మాత్రమే ఈ ఐదేళ్లలో పూర్తయ్యాయి. హక్కుగా రావాల్సిన నిధులు రాబట్టుకోవటంలో వైకాపా సర్కారు విఫలమైనట్లుగా సమాచార హక్కు చట్టం స్పష్టం చేస్తోంది. గడచిన రెండేళ్లలో తిరుపతి ఐఐటీకి నిధులు విడుదల చేయాలంటూ ఒక్క అభ్యర్థన కూడా రాలేదని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉన్నత విద్యామండలి నుంచి సమాధానం రావటం.. పాలకుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది.
ఐసర్ పరిస్థితి మరింత దైన్యం