తిరుపతి నగరపాలక సంస్థకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఇంధన పొదుపు అవార్డు దక్కింది. సచివాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ చేతుల మీదుగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీష అవార్డును అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిమెంట్ కర్మాగారాలు, కార్యాలయ భవనాలు, స్థానిక సంస్థలు, పవర్ ప్లాంట్‌లలో తీసుకున్న ఇంధన పొదుపు చర్యలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటించింది.
స్థానిక సంస్థల విభాగంలో తిరుపతి నగరపాలక సంస్థకు ప్రథమ బహుమతి లభించగా.. మచిలీపట్నం నగరపాలక సంస్థకు రెండో స్థానం లభించింది. తిరుపతి నగరపాలక సంస్థకు ఏటా అవసరమైన 14 మెగావాట్‌ల విద్యుత్‌లో 12 మెగావాట్‌ల విద్యుత్‌ను సోలార్ ప్లాంట్‌ల ద్వారా ఉత్పత్తి చేసుకుంటున్నారు. గతంలో 13 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లిస్తుండగా... సోలార్ విద్యుత్ ఉత్పత్తి కారణంగా 12 కోట్ల రూపాయల మేర విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీష తెలిపారు.