ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూత - వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ గుండెపోటుతో కన్నుమూత

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూత
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూత

By

Published : Sep 16, 2020, 6:53 PM IST

Updated : Sep 16, 2020, 10:40 PM IST

18:50 September 16

ఎంపీ మృతి

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందారు. ఇటీవల చేసిన కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు సమాచారం. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా నాయుడు మండలం భీమవరం. ఆయన వైకాపా తరఫున తిరుపతి ఎంపీగా ఉన్నారు.  దుర్గాప్రసాద్ గతంలో నాలుగుసార్లు గూడూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985-1989, 1994-1999, 1999-2004, 2009-2014లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 1996-98లో తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. న్యాయవాద వృత్తిలో ఉంటూ ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో దుర్గప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు.

తిరుపతి అభివృద్ధికి కృషి

వైకాపా తరపున తిరుపతి ఎంపీగా ఘనవిజయం సాధించిన బల్లిదుర్గాప్రసాద్....పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన మార్కును కనబరిచారు. తిరుపతిపై ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. నగర అభివృద్ధిలో కీలకమైన జాతీయ స్థాయి విద్యాసంస్థలకు, రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఆయన అధిక ప్రాధాన్యమిచ్చేవారు. తిరుపతి నగరానికి మణిహారం లాంటి వినాయకసాగర్ అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారు. 11 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ అభివృద్ధి పనులను ఆయనే స్వయంగా ప్రారంభించారు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారు. మౌలిక వసతుల పరంగా తిరుపతి రైల్వే స్టేషన్​ను రాష్ట్రంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఆయన పాటుపడ్డారు. వీఐపీ లాంజ్ కోసం నిధులు తీసుకువచ్చి నిర్మించి అభివృద్ధి చేయించారు. రైల్వే బోర్డు ఛైర్మన్ తిరుపతి వచ్చినప్పుడల్లా ఆయన్ను కలిసి తిరుపతి- చంద్రగిరి మధ్య రైల్వే లైన్ల అభివృద్ధి కోసం పలు సార్లు నివేదికలు సమర్పించారు.

ఇక జాతీయ స్థాయి విద్యాసంస్థ తిరుపతి ఐఐటీ మొదటి స్నాతకోత్సవానికి కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్​ను ఆహ్వానించి....ఆయనతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయించారు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదా తీసుకురావటానికి కృషి చేయటంతో పాటు బాలుర వసతి గృహాలు నూతనంగా ఏర్పాటుతు కృషిచేశారు. కేవలం ఏడాదిన్నర మాత్రమే తిరుపతికి ఎంపీగా ఉన్నా....ఈ తక్కువ సమయంలోనే తన ముద్రను తిరుపతి నగరంపై చూపించగలిగిన బల్లిదుర్గాప్రసాద్ అకాలమరణం పార్లమెంటరీ నియోజకవర్గానికి తీరని లోటు అని పలువురు వ్యాఖ్యానించారు.  

ప్రముఖుల సంతాపం

  • తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఎంపీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.  ఏపీ అభివృద్ధికి దుర్గాప్రసాద్ ఎంతగానో కృషిచేశారని మోదీ అన్నారు.
  • ఎంపీ దుర్గాప్రసాద్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. అనేక ప్రజాఉద్యమాల్లో దుర్గాప్రసాద్ కీలక పాత్ర పోషించారని వెంకయ్య అన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రిగా దుర్గాప్రసాద్ సేవలు చిరస్మరణీయమని ఉపరాష్ట్రపతి తెలిపారు.
  • తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా దుర్గాప్రసాద్‌ సేవలు అందించారని గవర్నర్‌ పేర్కొన్నారు. దుర్గాప్రసాద్ సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
  • ఎంపీ దుర్గాప్రసాద్‌ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు. దుర్గాప్రసాద్‌ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. దుర్గాప్రసాద్‌ కుమారుడితో సీఎం ఫోనులో మాట్లాడారు. దుర్గాప్రసాద్ మృతికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.
  • తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
  • వైకాపా ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
  • ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పట్ల తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి సంతాపం తెలిపారు. దుర్గాప్రసాద్‌ మరణం వైకాపాకు తీరని లోటు అని అభిప్రాయపడ్డారు.
  • ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ప్రజాసంక్షేమం కోసం పరితపించిన వ్యక్తి దుర్గాప్రసాద్ అని  కిషన్‌రెడ్డి అన్నారు.
  • తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ రావు హఠాన్మరణంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో తాము కలిసి పనిచేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఆయనకు తెలుగుదేశం పార్టీలో అవకాశం లభించిందన్నారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని, దుర్గాప్రసాద్ హఠాన్మరణం చాలా బాధ కలిగిస్తోందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆయన భగవంతున్ని వేడుకున్నారు.
  • తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు, వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి దుర్గా ప్రసాద్ విశేష కృషి చేశారని గుర్తు చేశారు. బ‌‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతికి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర ది గ్ర్బాంతి వ్యక్తం చేశారు. కష్టపడేతత్వం కల్గిన ఆయన ఎంతో మంది ప్రజలకు విశేషంగా సేవలు చేశారని కొనియాడారు.  

ఇదీ చదవండి : సింహాల ప్రతిమలు మంత్రి వెల్లంపల్లి ఇంట్లో వెతకాలి: అయ్యన్న


 

Last Updated : Sep 16, 2020, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details