ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి లోక్​సభ స్థానంపైనే అందరి గురి..! - Tirupati latest news

ఓ వైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతుండగానే.. తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నికపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం వివిధ స్థానాలకు ప్రకటించే ఉప ఎన్నికల షెడ్యూల్‌లో తిరుపతి లోక్‌సభ స్థానం ప్రకటన వస్తుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఏప్రిల్‌లోనే పోలింగ్ ఉంటుందని భావిస్తున్న రాజకీయ పక్షాలు గెలుపుకోసం వ్యూహాలకు పదును పెడుతున్నారు.

Tirupati Lok Sabha by-election
తిరుపతి లోక్​సభ ఉపఎన్నిక

By

Published : Feb 27, 2021, 7:09 AM IST

తిరుపతి లోక్​సభ స్థానంపైనే అందరి గురి..

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. తిరుపతి లోక్‌సభకు విడిగా షెడ్యూల్‌ ప్రకటిస్తామని తెలిపింది. ఇవాళ షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉందని ప్రధాన రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. దక్షిణాదిన ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిలతో పాటు... తమిళనాడు, కేరళల్లోని ఒక్కో లోక్‌సభ స్థానానికి కూడా ఏప్రిల్‌ 6నే పోలింగ్‌ జరగనుంది. కాబట్టి తిరుపతి లోక్‌సభ స్థానం పోలింగ్‌ కూడా ఏప్రిల్‌ 6నే ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఎస్సీ రిజర్వుడు స్థానమైన తిరుపతి నుంచి గత ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచిన బల్లి దుర్గాప్రసాదరావు కరోనా కారణంగా చనిపోవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అధికార వైకాపా, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు... భాజపా, జనసేనలు కూడా తిరుపతిలో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నాయి. తిరుపతి లోక్‌సభస్థానం పరిధిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడుతో పాటు..... నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి శాసనసభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభతోపాటు, ఈ ఏడు శాసన సభ స్థానాల్నీ వైకాపానే గెలుచుకుంది.

తెదేపా అభ్యర్థి ఇప్పటికే ఖరారు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు తెదేపా చాన్నాళ్ల క్రితమే అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, గత ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే మళ్లీ తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఎన్నికల కోసం శాసనసభ నియోజకవర్గాలు, మండలాలు, బూత్‌లు, క్లస్టర్ల వారీగా కమిటీలను నియమించింది. ఎన్నికల ప్రచార పర్యవేక్షణ బాధ్యతల్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గల్లా జయదేవ్, లోకేష్, నిమ్మల రామానాయుడు, బీదా రవిచంద్రలకు అప్పగించింది. పురపాలక ఎన్నికల ప్రక్రియ ముగియగానే.. ఆ నాయకులంతా తిరుపతిపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం.

వైకాపా అభ్యర్థి గురుమూర్తి?

లోక్‌సభ స్థానాన్ని ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలుచుకోవాలన్న పట్టుదలతో వైకాపా ఉంది. అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆ పార్టీ తరపున డా.గురుమూర్తి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. బల్లి దుర్గాప్రసాద్‌ కుమారుడు కల్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు కాబట్టి, గురుమూర్తి అభ్యర్థిత్వాన్నే పార్టీ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వరాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరు మంత్రుల్ని, ముఖ్య నేతల్ని వైకాపా తిరుపతి ఎన్నికల కోసం మోహరించే అవకాశం ఉంది.

భాజపానా? జనసేనా?

మిత్రపక్షాలైన భాజపా, జనసేన ఉపఎన్నికలో పోటీపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. ఎవరికి వారు తమ అభ్యర్థినే బరిలో దించాలన్న భావనలో ఉన్నాయి. చర్చల ద్వారా ఒక నిర్ణయానికి వస్తామని చెబుతూనే... క్షేత్ర స్థాయిలో ఎవరి సన్నాహాలు వారు చేసుకుంటున్నారు. తిరుపతికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత, ఇతర ప్రత్యేకతల దృష్ట్యా అక్కడ పోటీ చేస్తే సత్తా చాటగలమని భాజపా భావిస్తోంది. అక్కడి సామాజిక సమీకరణాల దృష్ట్యా తాము పోటీ చేస్తేనే మెరుగైన అవకాశాలుంటాయని జనసేన అనుకుంటోంది. రెండు పార్టీలు త్వరలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

'అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో అమలు చేయని చంద్రబాబు.. ఇప్పుడు ఎలా చేస్తారో ?'

ABOUT THE AUTHOR

...view details