తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రచారం గురువారం ముగిసింది. ప్రధాన పార్టీల తరఫున తిరుపతి పార్లమెంటు పరిధి ఉన్న చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ముఖ్య నేతలు ప్రచారం చేశారు. తిరుపతిలో చంద్రబాబు ప్రచార సభలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడం, అది వైకాపా పనేనని, పోలీసులు స్పందించలేదని తెదేపా అధినేత రోడ్డుపైనే నిరసనకు దిగడం వంటి సంఘటనలు రాజకీయ వేడిని పెంచాయి. వైఎస్ వివేకా హత్యతో తమకు సంబంధం లేదని ప్రమాణం చేస్తానని, సీఎం జగన్ కూడా ప్రమాణం చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సవాలు విసిరారు. రాళ్ల దాడి పేరుతో చంద్రబాబు, ప్రమాణం పేరుతో లోకేశ్ కొత్త నాటకానికి తెర తీశారని వైకాపా నాయకులు విమర్శించారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తి ఎస్సీ కాదని ఆరోపించడం ద్వారా భాజపా మరో వివాదానికి తెరలేపింది. అవి రాజకీయ ప్రయోజనాలకు చేస్తున్న ఆరోపణలేనని వైకాపా తిప్పికొట్టింది.
వైకాపా ప్రచారాన్ని మంత్రులే నడిపించారు.. తిరుపతిలో ఐదు లక్షలకుపైగా ఆధిక్యం సాధించడమే లక్ష్యమని ప్రకటించుకున్న వైకాపా.. ఏడెనిమిది మంది మంత్రులను, పలువురు శాసనసభ్యులను రంగంలోకి దింపింది. ప్రచార బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షించారు. మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. నవరత్నాలతోపాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులు ప్రచారం చేశాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 14న తిరుపతిలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించాలని మొదట నిర్ణయించి.. తర్వాత రద్దు చేసుకున్నారు. సభ పెడితే కరోనా వ్యాపిస్తుందన్న ఉద్దేశంతోనే రద్దు చేసుకున్నానంటూ నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. పార్టీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలంటూ అంతకుముందూ లేఖ రాశారు. ముఖ్యమంత్రి రాసిన లేఖలను వాలంటీర్లు ఇంటింటికీ అందజేశారని, అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని తెదేపా ఆరోపించింది.