తిరుపతి నుంచే వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట పడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక వైకాపా ఓటమికి వేదిక కావాలని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా నేతలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... పనబాక లక్ష్మిని ఉపఎన్నికల్లో పోటీకి పెట్టాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు గట్టిగా ప్రయత్నం చేయాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. వైకాపా పాలనలో దోపిడీ, అరాచకాలే తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించి రాయలసీమ జిల్లాలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు శివారు ప్రాంతాలకు కూడా నీళ్లు తెచ్చిన ఘనత తెలుగుదేశందేనని గుర్తు చేశారు.
చిత్తూరు జిల్లాలో తెదేపా ప్రభుత్వం 1,70,000 ఇళ్లు నిర్మిస్తే వాటిని పేదలకు ఇవ్వకుండా శిథిలం చేస్తున్నారు. రేణిగుంటలో 15వేల కోట్ల రూపాయల పెట్టుబడికి ముందుకొచ్చిన రిలయన్స్‌ను కూడా వెనక్కి పంపేశారు. ఏడాదిన్నరగా వైకాపా ఒక్క పరిశ్రమ అయినా తెచ్చిందా?. అమర రాజా ఇన్ఫ్రా టెక్కు ఇచ్చిన భూములను వైకాపా వెనక్కి లాక్కుంది. ప్రశాంతమైన చిత్తూరు జిల్లాను అరాచకాలమయం చేయటంతో పాటు తిరుపతిని అన్నివిధాలా అప్రతిష్ట పాలు చేశారు. పింక్ డైమండ్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లపై తితిదే వేసిన కేసులు ఉపసంహరించుకుంటూ పిటిషన్ వేయడం.. ఆ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత చూసి మళ్లీ వెనక్కి తగ్గడం హాస్యాస్పదం- చంద్రబాబు,తెదేపా జాతీయ అధ్యక్షుడు