తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎండల మంట కంటే... పొలిటికల్ హీట్ పెరిగింది. నామినేషన్ల పర్వం ముగిశాక పతాక స్థాయికి చేరింది. మంత్రులు, ప్రధాన పార్టీల కీలక నేతలు ఇక్కడే మకాం వేశారు. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపుపై కన్నేశారు. ప్రచారంలో మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎవ్వరికెవరూ తగ్గకుండా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తమ క్యాండిడెట్ను విజయ తీరం చేర్చడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
7 అసెంబ్లీ నియోజకవర్గాలు
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో... మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో 3 చిత్తూరు జిల్లాలో ఉండగా... 4 నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఈ కారణంగా రెండు జిల్లాల్లోనూ రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార వైకాపా ఎలాగైన తన సిట్టింగ్ సీట్‌ను నిలబెట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్... ఈ ఎన్నిక బాధ్యతను ఏడుగురు మంత్రులకు అప్పగించారు. ఒక్కో మంత్రి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యత తీసుకున్నారు. వారికితోడు కొందమంది ఎమ్మెల్యేలను కేటాయించారు.
గడపగడపకూ వైకాపా...
ఈ ఎలక్షన్లో వైకాపా ప్రచారంలో దూసుకుపోతోంది. అన్ని అండదండలు ఉండటంతో... ఆ పార్టీ అభ్యర్థి డా.గురుమూర్తి క్యాంపెయిన్ ఫాస్ట్‌గా సాగుతోంది. అటు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు గట్టిగానే సపోర్ట్ ఇస్తున్నారు. గడపగడపకు వైకాపా పేరుతో... ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. గ్రౌండ్ లెవల్ క్యాడర్ తమ పార్టీ నేత గెలుపునకు ప్రతీఓటర్ను కలిసి... వైకాపా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. రాష్ట్ర హక్కుల కోసం వైకాపా ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావిస్తున్నారు. తమ పార్టీపై విమర్శలు చేస్తున్న వారికి సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.
తెదేపా డేర్ స్టెప్స్..
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాగా వెయ్యాలని తెదేపా ప్లాన్ వేసింది. అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాన్ని ప్రకటించింది. ఫలితంగా... పనబాక లక్ష్మీ ప్రచారంలో ముందంజలో ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాలను పనబాక చుట్టేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రులు సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ముఖ్య నేతలంతా పనబాకకు అండగా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థిపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు తెదేపా క్యాడర్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కచ్చితంగా గెలిచి రాష్ట్ర హక్కుల కోసం పోరాడతానని, దిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న పరిచయాలతో అభివృద్ధి చేస్తానని పనబాక లక్ష్మీ ప్రచారం చేస్తున్నారు.
భాజపా కీలక నేతలు ఇక్కడే..!
తిరుపతి ఉప ఎన్నికలో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో భాజపా ఉంది. విద్యావంతురాలు, మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను తమ అభ్యర్థిగా ప్రకటించి... అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి నేతలంతా తిరుపతి, నెల్లూరులో మకాం వేశారు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు సోము వీర్రాజు. జనసేన-భాజపా కూటమి అభ్యర్థి విజయం కోసం ఇరుపార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి, ముఖ్యంగా తిరుపతి అభివృద్ధికి చేసిన కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అటు సోషల్ మీడియానూ ఎంత వాడాలో అంత వాడుతున్నారు.
చింతామోహన్... ఆయనే ఓ బ్రాండ్..!
కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించి ఆయన కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసిన నేత చింతామోహనే. ఆరుసార్లు గెలిచారు. ఓసారి తెదేపా నుంచి, ఐదుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈసారీ తననే ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ప్రజల్లో తిరుగుతున్నారు. తాను ఎంపీగా పనిచేసినప్పడు చేసిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తున్నారు. అయితే... ప్రత్యర్థి పార్టీలకున్నంత సౌకర్యాలు, క్యాడర్ సపోర్ట్ చింతామోహన్‌కు లేవు. ఆయనే ఓ బ్రాండ్‌గా మారి ప్రచారం చేస్తున్నారు. అభిమానులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ క్యాడర్ కాస్త తక్కువ యాక్టివ్‌గా ఉంది. అయినా చింతామోహన్ స్పీడ్ తగ్గించకుండా దూసుకెళ్తున్నారు.
ఇదీ చదవండి:
గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ బహిర్గతం: హైకోర్టులో విచారణ