పూర్తిగా కోలాహల వాతావరణం.. ఇసుకేస్తే రాలనంత జనం. ఇది గతంలో తిరుపతి రైల్వే స్టేషన్లో కనిపించే పరిస్థితి. రోజుకు ఒక్క తిరుపతి రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణం చేసే యాత్రికుల సంఖ్య అక్షరాలా 70వేలకు పై మాటే. వచ్చేపోయే 107కి పైగా రైళ్ల ద్వారా రోజుకు 40లక్షల రూపాయల చొప్పున....ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించే అతిపెద్ద వ్యవస్థ తిరుపతి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్కు వచ్చే ప్రయాణికులు, శ్రీవారి భక్తులపై ఆధారపడి స్టేషన్ ప్రాంగంణంలో ఆటో డ్రైవర్లు ఉపాధి పొందేవారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 వేల ఆటోలను నగర వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో తిప్పుతూ...ప్రయాణికులను, యాత్రికులను గమ్యస్థానాలకు చేరవేసేవారు. ఐతే ఇదంతా గతం. కరోనా మహమ్మారి విజృంభణతో రైల్వే స్టేషన్ ఆధారిత ఆటో డ్రైవర్లు అడ్రస్ లేకుండా పోయారు.
జనతా కర్ఫ్యూ మొదలుకుని.. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రైళ్ల సర్వీసులు పూర్తిగా రద్దైపోయాయి. తిరుమల శ్రీవారి దర్శనాలను సైతం భక్తులకు నిలిపివేయటంతో అసలు ఉపాధి ఊసే లేకుండా పోయింది. మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో.. ఉన్న డబ్బులు రెండు నెలల పాటు ఇంటిని గడిపేందుకు ఆటో డ్రైవర్లంతా వినియోగించుకున్నారు. కానీ ఈ మహమ్మారి ఎంతకీ పోకపోవటంతో.. లాక్ డౌన్ ఆంక్షల్లోనూ సడలింపులు రావటంతో...తిరిగి బతుకులు గాడిన పడతాయని ఆశపడ్డారు. అయినా కేంద్రం పరిమిత సంఖ్యలో మాత్రమే రైల్వే సర్వీసులను ప్రారంభించింది. వందల రైళ్లు...వేలాది మంది ప్రయాణికులు తిరిగిన చోటే ఇప్పుడు 10 నుంచి 15 మంది తిరుగుతున్న పరిస్థితి.
ఒక్క రైలులోనూ 1200మంది ప్రయాణం చేసే సదుపాయం ఉన్నా.. రోజుకు 200 నుంచి 300 మంది మాత్రమే వస్తున్న పరిస్థితి. కేసులు రోజు రోజుకు అధికమవుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనాల కోసం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ఆంక్షల సడలింపులు వచ్చినా.. ఉపాధి లేక తిరుపతి ఆటో డ్రైవర్లంతా అల్లాడుతున్నారు.