veterinary students:పశు వైద్య పట్టభద్రులు, విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సాధారణ వైద్య విద్యార్థులతో సమానంగా గౌరవవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశువైద్య ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ పశువైద్య పట్టభద్రులు నిరసనలు చేపట్టారు. సీఎం జగన్ పాదయాత్ర నాటి హామీలను అమలు చేయకపోగా పశువైద్య విద్యను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్రంలోని నాలుగు పశు వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సాధారణ వైద్యవిద్యతో సమానమైన వృత్తిగా పశువైద్య విద్యను గుర్తిస్తామని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్.. రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవవేతనం పెంచుతామని హామీ ఇచ్చినా అది అమలు కావడం లేదని వాపోయారు. మరోవైపు నిరుద్యోగ పశువైద్య పట్టభద్రులు విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టులను భర్తీ చేయాలని, సంచార పశువైద్యశాలల్లో శాశ్వత ప్రాతిపదికన వైద్యుల నియామకాలు చేపట్టాలని నిరుద్యోగ పశువైద్య పట్టభద్రులు నిరసనకు దిగారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో ఆందోళన చేపట్టారు. హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తిరుపతి, కృష్ణా జిల్లా గన్నవరం, కడప జిల్లా ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలల ఆవరణల్లో విద్యార్థులు ఆందోళన చేపట్టి దీక్షా శిబిరాల్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,217 గ్రామీణ పశు వైద్యశాలల్ని ఉన్నతీకరించాలని, ప్రభుత్వం ప్రారంభించనున్న 365 సంచార పశువైద్యశాలల్లో తమను నియమించాలని పశువైద్య పట్టభద్రులు డిమాండ్ చేశారు. పశు వైద్య విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాన్ని.. సాధారణ వైద్య విద్యార్థుల స్థాయిలో పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని పశువైద్య విద్యార్థులు, పట్టభద్రులు హెచ్చరించారు.