తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి.. ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్రం దృష్టి అంతా తిరుపతి వైపే ఉంది. అధికార-ప్రతిపక్షాల విమర్శలతో రాష్ట్రం మెుత్తం ఎన్నికలు జరుగుతున్నాయా? అనేలా.. హడావుడి పెరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాన్ని మెుత్తం చుట్టేస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో... మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో 3 చిత్తూరు జిల్లాలో ఉండగా.. 4 నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఈ కారణంగా రెండు జిల్లాల్లోనూ రాజకీయం రసవత్తరంగా మారింది. వైకాపా ఎంపీ బల్లి దుర్గప్రసాద్ మృతితో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక గురువారంతో ప్రచారం.. ముగియనుండటంతో ఇంకాస్త జోరు పెంచేశాయి పార్టీలు. 17న పోలింగ్ జరగనుండగా.. మే 2న ఫలితం రానుంది.
వైకాపా అభివృద్ధి మాట..
వైకాపా అభ్యర్థిగా గురుమూర్తిని ప్రకటించినప్పటి నుంచి.. ప్రచార బరిలో దూసుకెళ్తోంది అధికార పార్టీ. ఎలాగైనా తమ సిట్టింగ్ సీట్‌ను నిలబెట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. నవరత్నాలు అమలునే తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది. 22 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించమంటూ చెబుతోంది. వైఎస్ జగన్ పాలనను చూసి తమ అభ్యర్థికి ఓటేయాలంటూ.. ఓటర్లను అభ్యర్థిస్తోంది. ఓ వైపు షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మంత్రులు, ఎంపీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో లోక్‌సభ నియోజకవర్గంలో సభలు నిర్వహించారు. తమ అభ్యర్థి 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తారని వైకాపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొనాలని నిర్ణయించారు. కానీ కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పర్యటనను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించి.. తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు బహిరంగ లేఖలు రాశారు.
భాజపా-జనసేన మేనిఫెస్టో
తిరుపతి ఉప ఎన్నికలో పొత్తుతో ముందుకెళ్తున్నాయి భాజపా-జనసేన. ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను ప్రకటించినప్పటి నుంచీ.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అందులో భాగంగానే.. ఆధ్యాత్మికం, నైపుణ్యం, ఉపాధి కల్పన, సంపూర్ణ ఆరోగ్యం, విద్య, రహదారులు, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, మత్స్యరంగం ఇలా అన్ని రంగాలను స్పృశించేలా మేనిఫెస్టోనే రూపొందించారు. భారతీయ జనతా పార్టీ జాతీ అధ్యక్షుడిని ప్రచారానికి పిలిచి వేడి పెంచేసింది. మరోవైపు పవన్ కల్యాణ్ సైతం బహిరంగ సభ నిర్వహించారు. భాజపా శ్రేణులు మెుదటినుంచి రత్నప్రభ గెలుపు కోసం ఊరురా తిరుగుతున్నారు. వీటితో పాటు పవనే సీఎం అంటూ భాజపా నేతలు ప్రకటనలు చేస్తున్నారు. జనసేన అధినేతపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ ఇమేజ్‌కు తోడు ప్రత్యేక మేనిఫెస్టో కలిసివస్తోందని అభిప్రాయపడుతోంది కాషాయ దళం. మరోవైపు వైకాపా అభ్యర్థి గురుమూర్తి మతంపై భాజపా ఆరోపణలు చేస్తోంది. గురుమూర్తి అభ్యర్థిత్వంపై ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని తెలిపింది.