TTD EO Dharma Reddy: తిరుమలలో గదులు దొరకడం లేదని చాలా మంది భక్తులు ఫిర్యాదు చేశారని, అడ్వాన్స్డ్ దర్శన టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులు తిరుపతిలో బస చేసి స్వామివారి దర్శనానికి రావాలని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఈ ఉదయం తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 28 మంది భక్తులు... తమకు ఎదురైన సమస్యలను ఈవో దృష్టికి తీసుకొచ్చారు. త్వరలో టైంస్లాట్ టోకెన్లను ప్రారంభిస్తామని, టోకెన్లు తీసుకున్న భక్తులు తిరుపతిలో గదులు పొంది రావాలని ఈవో అన్నారు. బ్రేక్ దర్శన సమయం 10 గంటలకు మార్చడం వల్ల తిరుమలలో గదుల వసతులపై భారం తగ్గుతుందన్నారు.
లడ్డూ విక్రయశాలలో కొన్నింటిలోనే లడ్డూలు ఇవ్వడం వల్ల భక్తులకు సమయం పడుతుందని అన్నింటినీలోనూ లడ్డులు విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. సెప్టెంబరు నెలలో 21.12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. సెప్టెంబరు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 122.19 కోట్లు కాగా లడ్డుప్రసాదాలు విక్రయాలు 98.44 లక్షలు జరిగిందన్నారు. అన్నప్రసాదాలు 44.7 లక్షల మంది స్వీకరించారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.