కలియుగ వైకుంఠనాథుడు...తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు విరాళంగా ఇచ్చిన స్థిరాస్తులను విక్రయించాలని తితిదే నిర్ణయించింది. ప్రపంచ నలుమూలల ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు....మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను తితిదే పేరిట అందజేశారు. ఇలా దేశం నలుమూలల వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు శ్రీవారి పేరిట ఉన్నాయి. ఫిబ్రవరి 29 తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో స్వామివారి ఆస్తులు విక్రయించాలని తీర్మానం చేశారు.
ఈ తీర్మానానికి అనుగుణంగా తితిదే ఆస్తులను విక్రయించడానికి నాలుగు కేటగిరీలుగా విభజించారు. వీటిలో కోర్టు వివాదాలతో విక్రయించడానికి వీలుకానివి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి, దేశవ్యాప్తంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్నవి, తితిదే ఏర్పాటు చేసే బృందాల ద్వారా విక్రయించాల్సినవిగా విభజించారు. ఇందులో భాగంగా తొలి విడతలో తితిదే ఏర్పాటు చేసిన బృందాలు విక్రయించే ఆస్తుల్లో తమిళనాడు రాష్ట్రంలోని 26 ఆస్తులను గుర్తించారు. తొలి విడతలో విక్రయించడానికి గుర్తించిన ఆస్తుల్లో కనిష్టంగా 72 వేల రూపాయల నుంచి గరిష్టంగా 43.74 లక్షల రూపాయల విలువ చేసే ఆస్థులు ఉన్నాయి. వీటన్నింటికి తితిదే 1.52 కోట్ల రూపాయల మేర ధర నిర్ణయించింది.
నిర్వహణలో లేని నిరర్థక ఆస్తులను విక్రయించాలని నిర్ణయం తీసుకొన్న తితిదే... జనవరి, ఫిబ్రవరి నెలలో తితిదే సర్వేయర్ల ద్వారా తమిళనాడులోని స్థిరాస్తులపై సర్వే చేయించి తొలి విడత విక్రయానికి 26 ఆస్తులను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ఆస్తుల విక్రయం కోసం ఎనిమిది మంది అధికారులతో కూడిన రెండు బృందాలు ఏర్పాటు చేసింది. తొలి బృందానికి తితిదే సహాయ కార్యనిర్వహణాధికారి ఉదయభాస్కరరెడ్డి, రెండో బృందానికి తితిదే ఆస్థుల విభాగ తహశీల్దార్ గౌరిశంకరరావు నేతృత్వం వహించనున్నారు. వీరి పరిధిలో తొలి బృందంలో మునీంద్ర, మోహన్‌రావు, బాలాజీ...రెండో బృందంలో సుబ్బరాయుడు, హరినాథ్, గురవయ్య సహాయకులుగా సేవలు అందించనున్నారు. ఆస్తుల విక్రయ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన అధికారుల బృందం...బహిరంగ వేలం విధి, విధానాలు ఖరారు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.