ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

tirumala: శ్రీవారికి రోజూ ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా..!

శ్రీవారి ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. శ్రీవారి నివేదనల కోసం ఎన్నో రకాల ప్రసాదాలను తితిదే తయారు చేస్తోంది. శ్రీనివాసుని లడ్డూకి తితిదే పేటెంట్‌ హక్కులను సైతం సాధించుకుంది. ఈ లడ్డూల ప్రత్యేకత ఏంటి?, రోజూ శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారు?, ఏ సమయంలో ఏం నివేదిస్తారో తెలుసా? ఐతే ఇదీ చదవండి.

tirumala
tirumala

By

Published : Oct 7, 2021, 1:58 PM IST

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి విశ్వవ్యాప్తంగా పేరుంది. తిరుమలేశునికి నివేదనల కోసం ఎన్నో రకాల ప్రసాదాలు తితిదే తయారు చేయిస్తోంది. వీటిలో లడ్డూలకు భక్తకోటి నుంచి విశేష ఆదరణ ఉంది. స్వామివారి ప్రసాదం కోసం రాజులు, రాణులు ఎన్నో దానాలు చేశారు. 1803లో ఆలయంలో ప్రసాదాల విక్రయాన్ని అప్పటి మద్రాసు ప్రభుత్వం ప్రారంభించింది. లడ్డూ తయారీకి రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు. అది కాస్తా 1940లో లడ్డూగా రూపొందింది. నామమాత్రంగా ప్రసాదాలు తయారు చేస్తుండగా తితిదే పాలకమండలి 1950లో లడ్డూల తయారీని పెంచింది. వీటి తయారీకి వాడాల్సిన ముడిసరకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. ఈ దిట్టాన్ని భక్తుల సంఖ్యను బట్టి పెంచుకొస్తున్నారు. తితిదే కొలమానాల ప్రకారం 5,100 లడ్డూల తయారీకి 185 కిలోల ఆవు నెయ్యి, 200కిలోల శెనగపిండి, 400కిలోల చక్కెర, 35కిలోల జీడిపప్పు, 17.5 కిలోల ఎండుద్రాక్ష, 10 కిలోల కలకండ, 5కిలోల యాలకులు అవసరం. నిత్యం లక్ష లడ్డూల తయారీ వరకు పోటులో సామర్థ్యం ఉంది. కొన్నేళ్ల కింద బూందీ పోటును వెలుపలికి తీసుకొచ్చిన అనంతరం నిత్యం మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు లడ్డూల తయారీ పెరిగింది. లడ్డూలను రెండు రకాల పరిమాణంతో తయారు చేస్తున్నారు. కల్యాణం లడ్డూ పేరుతో పిలిచే ప్రసాదం బరువు 750 గ్రాములు, సాధారణ లడ్డూ బరువు 140 నుంచి 170 గ్రాములు ఉంటుంది. కల్యాణ లడ్డూను రూ.200, సాధారణ లడ్డూను రూ.50 వంతున తితిదే విక్రయిస్తోంది. శ్రీనివాసుని లడ్డూకి తితిదే పేటెంట్‌ హక్కులను సాధించుకుంది.

శ్రీనివాసునికి 50 రకాల ప్రసాదాలు

శ్రీవారి మూలమూర్తికి ప్రతిరోజూ నివేదించే ప్రసాదాలు ఆగమశాస్త్రం మేరకు సమర్పిస్తారు. శ్రీనివాసుడికి నిత్యం ఎన్నిసార్లు నైవేద్యం పెట్టాలి, ఎన్నిరకాల ప్రసాదాలు ఉండాలనే దానిపై ఆగమశాస్త్రంలో నిర్దేశించిన విధంగానే అర్చకులు నివేదిస్తారు. ఆయా ప్రసాదాల్లోనూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. శ్రీనివాసునికి దాదాపు 50 రకాల ప్రసాదాలను వినియోగిస్తున్నారు. వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యులు నిర్దేశించిన నిబంధనల ప్రకారం శ్రీవారికి నైవేద్యం ఇప్పటికీ సమర్పిస్తున్నారు. సుప్రభాత సేవ సమయం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ప్రసాద నివేదనలు ఉంటాయి. రోజూ జరిగే నిత్యసేవల సమయంలో విరామ సమయంలో వివిధ రకాలైన నివేదనలు జరుగుతాయి. సుప్రభాత సమయంలో నవనీతం, గోక్షీరంతో తయారుచేసిన పదార్థాలను నివేదిస్తారు. తోమాల పూర్తి అయిన తరువాత కొలువు సమయంలో నల్లనువ్వులు, బెల్లం, శొంఠి పెడతారు. సహస్రనామార్చన తరవాత జరిగే మొదటి గంటలో మీగడ, వెన్న, పెరుగుతో తయారుచేసిన అన్నాన్ని స్వామివారికి నివేదిస్తారు. రోజువారీ చిత్రాన్నం, దద్దోజనం, క్షీరాన్నం, కదంబం, పాయసాన్నం నివేదిస్తారు. మధ్యాహ్న ఆరాధనలో నాదుకం, లడ్డూ, దోసె, వడ, అప్పం నివేదిస్తారు. సాయంకాలం అష్టోత్తర శతనామార్చన తరువాత శుద్ధన్నం, సీరా నివేదనగా సమర్పిస్తారు. రాత్రి నైవేద్య సమయంలో తోమాల తరవాత మిరియాలతో తయారుచేసిన మరీచ్చాన్నం, ఉడాన్నం నివేదిస్తారు. రాత్రి ఆరాధన తరవాత విశ్రాంతి సమయంలో పాయసం నైవేద్యంగా పెడతారు.

ఇదీ చదవండి

ttd: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి వాహన సేవలు

ABOUT THE AUTHOR

...view details