కరోనా వైరస్ ప్రభావం తిరుమల శ్రీవారి ఆలయం మీద పడటంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశాలు నిషేధించిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు స్వామి వారి నిత్య కైంకర్యాలు యధావిధిగా జరుగుతున్నా.. భక్తుల దర్శనాలకు మాత్రం అనుమతి లేదు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను ఎలా అనుమతించాలనే అంశంపై తితిదే కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్శన విధానాల్లో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో గంటల తరబడి వేచిచూసే భక్తులకు తితిదే అన్న ప్రసాద వితరణ, వసతి గృహాల్లో బస...శ్రీవారి దర్శనంలో సాధారణంగా ఉండే ఈ విధానాలన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మార్చి 20 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. లాక్‌డౌన్ గడువు సమీపిస్తుండటం.. అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల మినహాయింపులు ఇస్తున్న క్రమంలో తితిదే ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు భౌతిక దూరం పాటిస్తూ.. తిరుమల శ్రీవారిని దర్శంచుకోవడానికి వీలుగా భక్తులను నియంత్రించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.