కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో, అదనపు ఈవో, ప్రధాన అర్చకులతో కలిసి బ్రహ్మోత్సవాల వివరాలను ఆయన వెల్లడించారు. శనివారం ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలవుతాయని....రాత్రి ఎనిమిది గంటల సమయంలో పెద్ద శేషవాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయని అన్నారు. పూర్వ సంప్రదాయాలను అనుసరిస్తూ గరుడ సేవ రోజు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. 24వ తేదీ ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి జగన్మోహనరెడ్డి శ్రీవారి సేవలో పాల్గొంటారని అనంతరం నాదనీరాజనం వేదికగా జరగుతున్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొంటారని తెలిపారు. అదే రోజు తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న వసతిగృహాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేస్తారన్నారు.
పారదర్శకత కోసమే కాగ్ ఆడిటింగ్
తితిదే నిధుల వినియోగంపై పారదర్శకత కోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ ద్వారా ఆడిటింగ్ నిర్ణయం తీసుకున్నాయని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలలో దళారి వ్యవస్థను పూర్తి స్థాయిలో నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. తితిదే నిధులను ధార్మికేతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారనటంలో వాస్తవం లేదన్నారు. తిరుమల వేదికగా అన్యమత ప్రచారం సాగుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను ఆయన ఖండించారు.
వారందరూ డిక్లరేషన్ ఇవ్వడం లేదు కదా!