Tirumala Brahmotsavam 2022: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రుత్వికులు, తితిదే అధికారులు, భక్త జన సందోహం మధ్య..శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వ సైన్యాధక్షుడు విశ్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల గిరులలో పండుగ వాతావరణం సంతరించుకుంది. రేపు సాయంత్రం 5.45 నుంచి 6:15 గంటల మద్య మీణాలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగణ్ పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం 9 గంటలకు వాహన సేవలు ప్రారంభమవుతాయి. పెద్దశేష వాహనంసేవతో ప్రారంభమై రోజుకు రెండు పూటలా స్వామివారు వివిధ వాహన సేవలపై దర్శనమిస్తారు. తొమ్మిది రోజుల పాటూ అంగరంగవైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు తితిదే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంకు, తిరువీధుల్లో, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవతా మూర్తుల ప్రతిరూపాలు యాత్రికులను కనువిందు చేస్తున్నాయి. విద్యుత్ వెలుగుల మధ్య కొండపై బ్రహ్మోత్సవ సంబరాలు మొదలయ్యాయి.
సెప్టెంబర్ 27వ తేదీ మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. అదే రోజున తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
పెద్దశేషవాహనం (27వ తేదీ రాత్రి 9 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం.
చిన్నశేషవాహనం (28వ తేదీ ఉదయం 8 గంటలకు): రెండో రోజు ఉదయం స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది.
హంస వాహనం (28వ తేదీ రాత్రి 7 గంటలకు): బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తాడు.
సింహ వాహనం(29వ తేదీ ఉదయం 8 గంటలకు): శ్రీవారి దశావతారాల్లో నాలుగోది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. యోగశాస్త్రంలో సింహం బలానికి (వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.
ముత్యపుపందిరి వాహనం (29న రాత్రి 7 గంటలకు): జ్యోతిష్యశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.
కల్పవృక్ష వాహనం (30వ తేదీ ఉదయం 8 గంటలకు): క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది.
సర్వభూపాల వాహనం (30వ తేదీ రాత్రి 7 గంటలకు): సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.
మోహినీ అవతారం (అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం): బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.