Sri Padmavathi Ammavari Brahmotsavam-2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ధనుర్లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య అర్చకులు ధ్వజారోహణం నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ సలహాదారు, కంకణభట్టార్ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
రాత్రి జరిగే చిన్న శేషవాహనంతో సేవలు ప్రారంభం..
ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు. రాత్రికి జరిగే చిన్న శేషవాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి.