వీరింట్లో ఎవరి తరానికి వారే ప్రతినిధులు. వయసు రీత్యా మూడు తరాలకు ప్రాతినిథ్యం వహించినా వృత్తి మాత్రం ఒకటే. మహిళలు వంటింటికే పరిమితమయ్యే రోజుల్లోనే వైద్యవిద్య అభ్యసించి జిల్లాస్థాయి అధికారిగా సేవలు అందించారొకరు. తల్లి స్పూర్తితో మధుమేహ వ్యాధి నిపుణురాలిగా పేరుగడించారు మరొకరు. అమ్మమ్మ, తల్లి వారసత్వం కొనసాగిస్తూ వైద్య రంగంలో తనకంటూ గుర్తింపు కోసం కృషి చేస్తున్న యువ వైద్యురాలు ఇంకొకరు. చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని వరదయ్యపాళెంలో కె.సరోజ కుటుంబంలో ఉన్నారీ ఆదర్శ మహిళలు.
1965లోనే తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో సరోజ వైద్య విద్య పూర్తిచేశారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో సేవలు అందించారు. గ్రామీణ నేపథ్యం ఉన్నా జిల్లాస్థాయి అధికారిగా సేవలు అందించిన తల్లిని స్ఫూర్తిగా తీసుకున్న సరోజ కూతురు కృష్ణ ప్రశాంతి తిరుపతిలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. కర్నూలులో ఎండీ జనరల్ మెడిసిన్ చదివి వైద్యురాలిగా సేవలందిస్తున్నారు.