ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తితిదే ఆడిట్‌ బాధ్యతలు కాగ్‌కి అప్పగించాలి: సుబ్రహ్మణ్య స్వామి

By

Published : Dec 29, 2019, 10:07 PM IST

తితిదేపై రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి సరిగా లేదని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. వందేళ్లుగా వస్తున్న కానుకలపై ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఎలా ఆడిట్‌ చేస్తారని.. అంతా సవ్యంగానే ఉందని ఎలా ధ్రువీకరిస్తారని ప్రశ్నించారు. తితిదేపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.

'The CAG audit should be conducted on the gifts and deposits offered by the devotees' says Subramaniam
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

తితిదేకు భక్తులు సమర్పిస్తున్న కానుకలు, జమా ఖర్చులపై కాగ్ ఆడిట్ జరిపించాలని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో గ్లోబల్ హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవాలయాల పరిరక్షణ కార్యక్రమానికి ఆయన శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామితో కలిసి హాజరయ్యారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా ఏకం కావాలని సుబ్రహ్మణ్య స్వామి సందేశమిచ్చారు. దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతుండటం ఆక్షేపణీయం అన్నారు. తితిదేపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న అధికారులే స్వామి వారికి వస్తున్న కానుకలను ఆడిట్ చేసి అంతా సవ్యంగా ఉందని ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. సామూహికంగా మత మార్పిడులకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు. రామ జన్మభూమి, కృష్ణ జన్మభూముల పునర్వైభవం, కాశీ విశ్వనాథుని ఆలయ అభివృద్ధి తమ లక్ష్యాలని ప్రకటించారు. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రసంగిస్తూ... తితిదే ఉద్యోగులుగా హిందువులే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సుబ్రహ్మణ్య స్వామి ప్రసంగం

ఎన్నో ఏళ్లుగా తితిదేకి వస్తున్న కానుకలు, విరాళాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఖర్చుచేస్తుంది. కానీ వాటికి లెక్కలు ఉండటం లేదు. ప్రభుత్వంలో ఉన్న అధికారులే స్వామి వారికి వస్తున్న కానుకలను ఆడిట్ చేసి అంతా సవ్యంగా ఉందని అంటారు. ఒక సంస్థపై ప్రభుత్వ పెత్తనం ఉన్నప్పుడు ఆడిట్ బాధ్యతలను కాగ్ వంటి స్వతంత్ర శాఖలకు అప్పగించాలి. అప్పుడే సరైన నివేదిక వస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి అది జరగటం లేదు. తితిదేకి గత ఐదేళ్లలో వచ్చిన కానుకలు, డబ్బుపై స్వతంత్ర దర్యాప్తు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించాలి

- సుబ్రహ్మణ్య స్వామి, భాజపా ఎంపీ

ఇదీ చదవండి:120 ఏళ్లు సేవలందించిన తహసీల్దార్ కార్యాలయం

ABOUT THE AUTHOR

...view details