ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 24, 2019, 5:19 AM IST

Updated : Nov 24, 2019, 7:15 PM IST

ETV Bharat / city

శ్రీవారి సన్నిధిలో డిజిటల్ గలగలలు...!

వడ్డీకాసుల వాడి సన్నిధిలో కాసుల గలగలల బదులు.. డిజిటల్ గలగలలు వినిపిస్తున్నాయి. తితిదే ఖజానాకు నిత్యం కోట్ల రూపాయలు వచ్చి చేరుతున్నా... కరెన్సీ నోట్లు మాత్రం కనపడడం లేదు. సాంకేతిక సాయంతో సేవలన్నింటినీ నగదు రహితంగా నిర్వహిస్తున్న తితిదే... గదుల బుకింగ్‌, టిక్కెట్ల విక్రయం, ట్రస్టులకు విరాళాలు, హుండీ కానుకలను సైతం డిజిటల్‌ లావాదేవీల రూపంలో అందిస్తోంది.

శ్రీవారి సన్నిధిలో వినిపించని కాసుల గలగలలు...!

శ్రీవారి సన్నిధిలో డిజిటల్ గలగలలు...!

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యకలాపాలు సాగిస్తోంది. దేవస్థానం వెబ్‌సైన్‌ను ఆధునీకరించిన అధికారులు.. భక్తులకు డిజిటల్‌ సేవలు అందుబాటులోకి తెచ్చారు. గదులు, సేవా టిక్కెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. స్వామివారి ట్రస్టులకు విరాళాలు, హుండీ కానుకలను సైతం అన్‌లైన్‌ ద్వారానే స్వీకరిస్తున్నారు.

నేరుగా స్వామివారి ఖాతాలోకి...

కరెంట్‌ బుకింగ్‌ కింద జారీ చేసే గదుల కేటాయింపు కేంద్రాల వద్ద... నగదు రహిత లావాదేవీలను తితిదే అందుబాటులోకి తెచ్చింది. పీవోఎస్ యంత్రాలతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా నగదును నేరుగా స్వామివారి ఖాతాకు జమయ్యేలా చేస్తోంది. తిరుమలలో మొత్తం 7 వేల 5వందల గదులు భక్తులకు అందుబాటులో ఉండగా వాటన్నింటినీ డిజిటల్‌ లావాదేవీల ద్వారా కేటాయిస్తున్నారు.

భక్తుల హర్షం

పద్మావతి, ఎంబీసీ గదుల కేటాయింపు కేంద్రాల్లో 100 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. సీఆర్​వో, టీబీసీ కేంద్రాల్లో మాత్రం 80 శాతానికి పైగా డిజిటల్‌ లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయి. నగదు రహిత సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వంద శాతమే లక్ష్యం...

దుకాణాల అద్దె, విద్యుత్‌, నీటి బిల్లుల వసూళ్లను డిజిటల్‌ లావాదేవీల ద్వారా నిర్వహించేందుకు తితిదే చర్యలు ప్రారంభించింది. వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నారు. టీసీఎస్ సంస్థకు ఈ బాధ్యతను అప్పగించారు. వీలైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. దేవస్థానం పరిధిలో వంద శాతం నగదు రహిత లావాదేవీలను నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇవీ చూడండి:

ఫాస్టాగ్‌... ఎక్కడ, ఎలా పొందాలి..?

Last Updated : Nov 24, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details