నేడు ఉదయం 10 గంటల 18 నిమిషాలకు సూర్య గ్రహణం మొదలుకానుంది. మధ్యాహ్నం 1.38 గంటలకు ముగియనుంది. గ్రహణం కారణంగా శ్రీకాళహస్తి మినహా రాష్ట్రంలోని ఆలయాలు మూతపడ్డాయి. శనివారం సాయంత్రం నుంచే ఆలయాల్లో దర్శనాలు నిలిచిపోయాయి.
తిరుమలలో..
శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ ముగియగానే.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి తెరుస్తారు. నిత్య కైంకర్యాల తర్వాత ఇవాళ రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. గ్రహణం కారణంగా.. ఈ ఆదివారం నాడు ఆర్జిత సేవలు, దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఇంద్రకీలాద్రిపై..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని.. గ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకే మూసివేశారు. పంచహారతులు, నివేదన అనంతరం.. కవాట బంధనం చేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు.. ఆలయాన్ని శుద్ది చేస్తారు. అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, హారతులు ఇస్తారు. గ్రహణం రోజున అన్ని రకాల ఆర్జిత సేవలను, దర్శనాలను నిలిపివేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
శ్రీశైలంలో..
శ్రీశైలం భ్రమరాంబామల్లికార్జున స్వామి దేవస్థానాన్ని గ్రహణం సందర్భంగా.. శనివారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. ఆదివారం గ్రహణం వీడిన తర్వాత.. మంగళ హారతులు, కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. సోమవారం నుంచి యథావిథిగా దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ క్షేత్రం ద్వారకా తిరుమల ఆలయమూ శనివారం మూతపడింది. ఆదివారం నిత్య కల్యాణం, ఆర్జిత సేవలు, వాహన సేవలు రద్దు చేశారు. గ్రహణం అనంతరం ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు.