తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం కోసం తెదేపా సర్వశక్తులు ఒడ్డుతోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడంతో పాటు నామినేషన్ ఘట్టాన్ని పూర్తి చేసిన తెదేపా.. ప్రచారాన్ని విస్తృతం చేసింది. రాష్ట్ర స్థాయి నేతలు తిరుపతి ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు ఉప ఎన్నికల బాధ్యుడిగా తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో స్థానిక నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి పనబాక లక్ష్మి.. స్థానిక నేతలతో కలిసి ప్రచారం లో పాల్గొంటున్నారు. మరో వైపు క్లస్టర్ స్థాయిలో కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
నలభై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తెదేపా నేతలు.. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి పవిత్రతను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ఇదే అంశాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. అమ్మ ఒడి పేరుతో సంక్షేమ పథకం అమలు చేశామంటున్న ప్రభుత్వం మద్యం మొదలు నిత్యావసరాల వరకు ధరలను పెంచడం ద్వారా సామాన్య ప్రజలకు దోపిడీ చేస్తోందని.. ఈ అంశాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలను నిర్దేశించారు.